రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం (నరేగా)లో ఈ ఏడాది స్వల్ప వ్యవధిలోనే అత్యధికంగా పని దినాలు వినియోగించడంపై కేంద్ర అధికారులు పరిశీలన చేయనున్నారు. ఒకటి, రెండు రోజుల్లో వీరు విశాఖపట్నం, విజయనగరం, అనంతపురం జిల్లాల్లో పర్యటించే అవకాశాలున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది రాష్ట్రానికి 20 కోట్ల పనిదినాలను కేటాయించింది. వీటిని కేవలం అయిదు నెలల్లోనే వినియోగించడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. నిజంగానే ఈ స్థాయిలో వినియోగించుకున్నారా? క్షేత్రస్థాయిలో అవకతవకలు చోటుచేసుకున్నాయా? అనే కోణంలో కేంద్ర అధికారులు పరిశీలించనున్నారని తెలుస్తోంది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ఉన్నతాధికారులు జిల్లా అధికారులను అప్రమత్తం చేశారు. కేంద్ర అధికారులు అడిగే సమాచారం అందుబాటులో ఉంచాలని, నరేగా అమలులో భాగంగా క్షేత్రస్థాయిలో నిర్వహించాల్సిన ఏడు రకాల దస్త్రాలను సిద్ధం చేయాలని ఆదేశించారు.
అదనంగా మరో 1.67 కోట్ల పనిదినాలు
నరేగాలో ఏటా కేటాయించే పనిదినాలను డిసెంబరులోగా పూర్తిగా వినియోగించుకొని అదనపు కేటాయింపుల కోసం రాష్ట్రాలు కేంద్రానికి మళ్లీ ప్రతిపాదిస్తుంటాయి. మిగతా మూడు నెలల (జనవరి- మార్చి) కాలానికి మరికొంత లేబర్ బడ్జెట్‌ను కేంద్రం కేటాయించడం రివాజు. 2021-22లో ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన 20 కోట్ల పనిదినాలు ఆగస్టు నాటికే పూర్తిగా వినియోగించుకున్నట్లు రాష్ట్ర అధికారులు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖకు సమాచారమిచ్చారు. కూలీల పనులకు ఇబ్బంది లేకుండా అదనపు కేటాయింపులు చేయాలన్న విజ్ఞప్తిపై మరో 1.67 కోట్ల పనిదినాలను కేంద్రం కేటాయించింది. అదనపు కేటాయింపులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు 21 కోట్ల పనిదినాలు వినియోగించుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. పనులకు హాజరవుతున్న మొత్తం 44,85,721 కుటుంబాల్లో ఇప్పటికే 3,10,980 కుటుంబాలు వంద రోజుల పనిదినాల లక్ష్యాన్ని పూర్తి చేసినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖకు తాజాగా సమాచారం పంపారు. ఒక్కో కూలీ సరాసరి రోజూ రూ.221.23 వేతనం పొందుతున్నారని పేర్కొన్నారు.