Chief Minister Jagan Reddy: స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డ్ ఎస్ఐపీబీ సమావేశంలో రాష్ట్రంలోకి మరిన్ని పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. వైయస్సార్ జిల్లా కొప్పర్తిలో కాసిస్ ఇ–మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమను ఏర్పాటు చేయనుండగా...
386 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఆమోదం తెలిపారు. వీటిలో ఎలక్ట్రిక్ బస్సుల తయారీ కోసం 286 కోట్లు, ఛార్జింగ్ మౌలిక సదుపాయాలకోసం 100 కోట్లు పెట్టుబడి పెట్టనున్నారు. తొలివిడతలో 1000 ఎలక్ట్రిక్ బస్సులు తయారుచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కాకినాడ ఎస్‌ఈజెడ్‌లో యూనిట్‌ను ఏర్పాటు చేయనున్న లైఫిజ్ ఫార్మాకు ఎస్ఐపీబీ ఆమోదించింది. మొత్తంగా 1900 కోట్ల పెట్టుబడిని పెట్టనున్న ఈ కంపెనీ ఏప్రిల్ 2024నాటికి కంపెనీ ఏర్పాటు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది.
మెటలార్జికల్ గ్రేడ్ సిలికాన్, పాలీ సిలికాన్, ఫ్లోట్ మరియు రోల్డ్ గ్లాసెస్ తదితర వాటి తయారీకోసం పరిశ్రమతోపాటు సోలార్ విద్యుత్ ప్రాజెక్టును ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటునకు ఎస్ఐపీబీ ఆమోదించింది. నెల్లూరు జిల్లా రామాయపట్నం వద్ద 5,147 ఎకరాల్లో తయారీ పరిశ్రమ.. 50 గిగావాట్లు, 10 గిగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టులను ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ నెలకొల్పేందుకు ఆమోదం తెలిపారు. కృష్ణాజిల్లా మల్లవల్లిలో మెగా ఫుడ్‌పార్క్‌ను అవిశా ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఏర్పాటు చేసేందుకు ఆమోద ముద్ర వేసి 11.64 ఎకరాల భూమి కేటాయించారు.
రాష్ట్రంలో ఆరు గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకూ ఆమోదం తెలిపిన ఎస్ఐపీబీ.. 81,043 కోట్ల పెట్టుబడితో 20,130 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాల కల్పన జరగనున్నట్లు వెల్లడించింది. వైయస్సార్ జిల్లా వొంగిమల్ల వద్ద 1800 మెగావాట్ల పంప్డ్ హైడ్రో స్టోరేజీ పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు అస్తా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. డిసెంబర్ 2029 నాటికి ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సోమశిల, ఎర్రవరం వద్ద రెండు పంప్డ్ హైడ్రో స్టోరేజీ పవర్ ప్రాజెక్టులకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. 2100 మెగావాట్ల ప్రాజెక్టుకోసం 8,855 కోట్లు షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ ఖర్చు చేయనుంది. అవుకు, సింగనమల వద్ద రెండు పంప్డ్ హైడ్రో స్టోరేజ్ ప్రాజెక్టులకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. అరబిందో రియాల్టీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థలు మొత్తంగా 6వేల315 కోట్ల పెట్టుబడి పెట్టనున్నాయి.
వైయస్సార్‌జిల్లా పైడిపాలెం వద్ద పంప్డ్ హైడ్రో, సోలార్, విండ్ పవర్ ప్రాజెక్టులను ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు చేయనుంది. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో సోలార్, విండ్ పవర్ ప్రాజెక్టులను ఏఎం గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటునకు ఆమోదం తెలిపారు. వీటి కోసం మొత్తంగా 19 వేల 600 కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు రాష్ట్ర ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చబోతున్నాయని..భారీగా ఉద్యోగాల కల్పన జరుగుతుందని సీఎం అన్నారు. రైతులకు పెద్దగా ఆదాయాలు రాని భూముల్లో ఏడాదికి ఎకరాకు 30వేల వరకూ లీజు కింద డబ్బు వస్తుందని సీఎం అన్నారు.
'గ్రీన్ ఎనర్జీలో దేశానికే ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలుస్తుంది' సీఎం జగన్ ఇవీ చదవండి: