కర్ఫ్యూ అమలు చేస్తున్నా రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట పడటం లేదు. ఒక్కరోజులో 90,750 నమూనాలు పరీక్షిస్తే... 21,452 మందికి పాజిటివ్‌గా తేలింది. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 13,44,386కు చేరింది. మహమ్మారికి మరో 89 మంది బలవగా... మొత్తం మరణాల సంఖ్య 8,988కి చేరింది. విశాఖ జిల్లాలో అత్యధికంగా 11 మంది ప్రాణాలొదిలారు. తూర్పుగోదావరిలో గరిష్టంగా 2,927 కేసులు నమోదయ్యాయి. కొత్తగా 19,095 మంది కొవిడ్ నుంచి కోలుకోగా... రాష్ట్రంలో ప్రస్తుతం లక్షా 97,370 మంది కరోనా చికిత్స పొందుతున్నారు. కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండియన్‌కు కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు.
ఓ వైపు తనిఖీలు.. మరో వైపు సమీక్షలు..
ప్రభుత్వ అనుమతి లేకుండా కడపలో కరోనా వైద్యం అందిస్తున్న ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అధికారులు తనిఖీలు చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు కేసు నమోదు చేశారు. నెల్లూరు కలెక్టరేట్‌లో మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, గౌతంరెడ్డి ఆధ్వర్యంలో... కొవిడ్ నియంత్రణ చర్యలపై సమీక్ష నిర్వహించారు. రోగులకు అందుతున్న సాయంపై కలెక్టర్, నోడల్ అధికారులతో మాట్లాడారు. ఆక్సిజన్ సరిపోవట్లేదని అధికారులు చెప్పగా... త్వరలోనే సరఫరా పెంచుతామని మంత్రులు హామీ ఇచ్చారు.
జగ్గయ్యపేటలో 100 పడకల కొవిడ్ కేంద్రం..
గుంటూరు జిల్లా చిలకలూరిపేట కొవిడ్ కేంద్రాన్ని... ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సందర్శించారు. ఐఎమ్ఏ సర్టిఫైడ్ వైద్యులు... సేవలు అందించేందుకు ముందుకు రావాలని కోరారు. నిజాంపట్నం సామాజిక ఆరోగ్య కేంద్రంలో కొవిడ్ కేర్ సెంటర్‌ను రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ ప్రారంభించారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట బాలికల గురుకుల పాఠశాలలో... 100 పడకల కొవిడ్ కేంద్రం ప్రారంభమైంది.
బయట తిరుగుతున్న వారికి కౌన్సెలింగ్..
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో పక్కాగా ఆంక్షలు అమలు చేస్తున్నారు. రాకపోకలు నియంత్రించటంతో విశాఖలో రహదారులు బోసిపోయాయి. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో సాయంత్రం బయట తిరుగుతున్న యువకులను అడ్డుకున్న పోలీసులు... వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. కరోనా నిబంధనలు పాటించని ప్రజలు, వ్యాపారులకు జరిమానా విధించారు.
కరోనా వేళ వెల్లివిరిసిన మానవత్వం..
కొవిడ్ మృతదేహాల దహన సంస్కారాల ఖర్చు భరించాలని గుంటూరు జిల్లా నరసరావుపేట పురపాలక సంఘం నిర్ణయించింది. మంగళగిరిలో ఓ వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందగా... కరోనా కావచ్చనే భయంతో కుటుంబసభ్యులు అంత్యక్రియలు జరపలేదు. విషయం తెలుసుకున్న ఇస్లామిక్ సేవా కమిటీ... హిందూ శ్మశానవాటికలో ఆఖరి ఘట్టం పూర్తిచేసింది. కృష్ణా జిల్లా నూజివీడు ఐదో వార్డు కౌన్సిలర్ పగడాల సత్యనారాయణ... ఆరు కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు. విశాఖ జిల్లా పాడేరు కొవిడ్ ఆస్పత్రిలో మృతదేహాల తరలింపు ఆలస్యమవుతోంది. దీనివల్ల శవాల మధ్యే చికిత్స పొందాల్సి వస్తోందని రోగులు వాపోతున్నారు. పాడేరు టెక్నో సంస్థలో మేనేజర్‌గా పనిచేస్తున్న మహారాష్ట్ర వాసి ప్రహ్లాద్... కరోనాతో మృతి చెందారు. తోటి ఉద్యోగులే ఆయన అంత్యక్రియలు పూర్తిచేశారు. Spot
ఆర్యవైశ్య సంఘం దాతృత్వం..
తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట ఏరియా ఆసుపత్రికి రోజూ 40 కేజీల ఆక్సిజన్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చేందుకు... ఆర్యవైశ్య సంఘం ముందుకొచ్చింది. విశాఖ జిల్లా అనకాపల్లి ఎన్టీఆర్ జిల్లా ఆసుపత్రిలో ఆక్సిజన్ పడకలు పెంచేందుకు... రాంకో సిమెంట్ కర్మాగారం 20 లక్షల విరాళం అందించింది. కర్ఫ్యూతో చిక్కుకుపోయిన పేదలు, కూలీలకు అక్షయపాత్ర ఫౌండేషన్ భోజన పొట్లాటలు పంపిణీ చేసింది. విశాఖలో కొవిడ్ కేసులు వెలుగుచూసిన ప్రాంతాల్లో హెచ్‌పీసీఎల్ సహకారంతో... సోడియం హైపోక్లోరైడ్‌ను పిచికారీ చేశారు. చిత్తూరు జిల్లా నగరి, పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో... శానిటైజర్లు, కొవిడ్ కిట్ల కోసం ఎమ్మెల్యే రోజా 5 లక్షలు అందించారు.
ఇదీ చదవండి:నిర్లక్ష్యమే 'రుయా' ఘటన కారణం..ప్రాథమిక విచారణలో వెల్లడి !