ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో రెవెన్యూ లోటు పాట్లు!

రాష్ట్రంలో రెవెన్యూ లోటు ఎన్నడూ లేనంతగా పెరుగుతుంది. రెవెన్యూ లోటు గత 7 నెలల కాలానికి రూ. 48,322.63 కోట్లకు చేరుకుంది. నెలలు గడిచే కొద్దీ రాష్ట్రం అప్పు పెరుగుతోంది. అక్టోబరు నెలాఖరునాటికి రాష్ట్రం వివిధ రూపాల్లో సమీకరించిన రుణం రూ.60,811 కోట్లకు చేరింది. అంచనాలకన్నా 125 శాతం మేర ఇప్పటికే పెరిగింది. ఒక వైపు రెవెన్యూ వసూళ్లు రూ.56,799 కోట్లకు పరిమితమయ్యాయి.

revenue deficit
revenue deficit

By

Published : Dec 3, 2020, 6:00 AM IST

రాష్ట్ర రెవెన్యూ లోటు గతంలో ఎన్నడూ లేనంత స్థాయికి చేరుకుంది. అక్టోబరుతో ముగిసిన 7 నెలల కాలానికి రూ.48,322.63 కోట్లకు చేరింది. నవంబరు లెక్కలు కూడా కలిపితే లోటు రూ.50వేల కోట్లు దాటినట్లేనని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్ర పునర్​వ్యవస్థీకరణ తర్వాత ఏనాడూ ఈ స్థాయిలో రెవెన్యూ లోటు లేదు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో అంతకు ముందెన్నడూ లేని స్థాయిలో రూ.26,646 కోట్లకు లోటు చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి 7నెలలకే ఆదాయం కన్నా ఖర్చు అనూహ్యంగా పెరిగింది. దాదాపు రెండు ఆర్థిక సంవత్సరాల నుంచి రెవెన్యూ ఆదాయం అంచనాలతో పోలిస్తే బాగా తగ్గింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఈ ఏడాది ఇలాంటి ఆర్థిక పరిస్థితులే ఉన్నాయని, కరోనా వల్ల పరిస్థితి మరీ దిగజారిందని ఆర్థికశాఖ అధికారులు పేర్కొంటున్నారు.

35 శాతమే వసూళ్లు

సాధారణంగా ప్రతి బడ్జెట్​ సమయంలోనూ రెవెన్యూ లోటు తగ్గిస్తామని, ఆదాయంతో పోలుస్తూ ఖర్చును నియంత్రిస్తామని ప్రభుత్వాలు చెబుతుంటాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ ఆదాయాలు భారీగా తగ్గినా..ఖర్చు అంచనాలకు తగ్గట్టుగానే, మరీ చెప్పాలంటే ఇంకా ఎక్కువే చేస్తున్నారు. తొలి 7 నెలల్లో కేవలం 56,798.91 కోట్ల రెవెన్యూ వసూళ్లను రాష్ట్రం సాధించింది. ఏడాది మొత్తానికి రూపొందించిన అంచనాలో ఇది కేవలం 35 శాతమే. ఇదే సమయంలో రెవెన్యూ ఖర్చు 1,05,121.54 కోట్లకు చేరింది. ఏడాది మొత్తానికి రెవెన్యూ ఖర్చు అంచనాలో ఇది 58శాతం.

రెండేళ్లుగా తగ్గిన వసూళ్లు

2019-20లో రెవెన్యూ వసూళ్లు అంచనాల కన్నా బాగా తగ్గాయి. రూ.1.78 లక్షల కోట్ల మేర ఉంటాయని ఆశిస్తే అవి రూ.1.10 లక్షల కోట్లే పరిమితమయ్యాయి. రాష్ట్రంలో సొంత పన్నుల్లో ఆదాయం, పన్నేతర ఆదాయం, కేంద్ర పన్నుల్లో వాటాలు, కేంద్రం నుంచి అందే గ్రాంట్ ఇన్ ఎయిడ్ కలిపి రాష్ట్ర రెవెన్యూ ఆదాయంగా లెక్కిస్తారు. 2014-15 నుంచి కూడా రెవెన్యూ లోటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సవాలు విసురుతోంది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో మాత్రమే రూ.5235.23 కోట్ల మిగులుతో బడ్జెట్​ ప్రతిపాదించారు. ఆ తర్వాత బడ్జెట్​ సంవత్సరం ముగిసే నాటికి మిగులు లేదు.

కారణాలేమిటి?

69 రోజుల లాక్​డౌన్ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చేసింది. జీఎస్టీ, స్టాంపులు రిజిస్ట్రేషన్లు, అమ్మకపు పన్ను తదితరాలన్నింటిలో అంచనాలతో పోలిస్తే సగం వసూళ్లనూ దక్కించుకోలేదు. 5 నెలలే మిగిలి ఉన్న పరిస్థితుల్లో రెవెన్యూ వసూళ్లు లక్ష్యం 35శాతం మాత్రమే ఉంది. ఏటా అంతకుముందు ఏడాది అంచనాల కన్నా బడ్జెట్​ 10 నుంచి 15శాతం పెరుగుతూ ఉంటుంది. కరోనా కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్​ స్వరూపమూ పెద్దగా మారలేదు. అలాంటి పరిస్థితుల్లోనూ వసూళ్లు మందకొడిగా ఉన్నాయంటే పరిస్థితి తీవ్రత స్పష్టమవుతోంది. అయిదారేళ్ల ఆర్థిక స్వరూపాన్ని పరిశీలించాక కూడా ఆదాయం రాని మార్గాల్లోనూ అధిక అంచనాలను పేర్కొంటున్నారు.

ఇదీ చదవండి :'అవినీతి జరిగిందని.. ఎందుకు రుజువు చేయలేకపోయారు?'

ABOUT THE AUTHOR

...view details