ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 23, 2020, 9:59 PM IST

Updated : Nov 24, 2020, 5:44 AM IST

ETV Bharat / city

'సహాయ సహకారాలందించండి'... సీఎస్‌కు ఎస్‌ఈసీ మరో లేఖ?

ఏపీ ఎస్​ఈసీ, సీఎస్ మధ్య లేఖల పరంపర కొనసాగుతోంది. తాజాగా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సీఎస్ నీలం సాహ్నికి మరో లేఖ రాసినట్లు సమాచారం. ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆయన పునరుద్ఘాటించారని తెలిసింది.

ap sec
ap sec

పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంపూర్ణ సహాయ సహకారాలు అందించాలని కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ సోమవారం మరో లేఖ రాసినట్లు తెలిసింది. ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆయన పునరుద్ఘాటించారని సమాచారం. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఈనెల 17న తాను జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను ఆ లేఖకు జత చేసినట్లు తెలిసింది. ఎన్నికల సంఘం జారీ చేసిన పిటిషన్‌పై (రిట్‌ పిటిషన్‌ నం.19258) హైకోర్టు ఈ నెల 3న ఇచ్చిన తీర్పును ఆయన లేఖలో ప్రస్తావించినట్లు సమాచారం.

‘ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం కోసం ఎన్నికల సంఘం 3 రోజుల్లోగా ప్రభుత్వానికి సమగ్ర వివరాలతో నివేదిక సమర్పించాలని హైకోర్టు సూచించింది. సోమవారం తమకు కోర్టు తీర్పు ప్రతి అందిన వెంటనే లేఖ రాస్తున్నా. ఎన్నికల సంఘం వినతిపై... ప్రభుత్వం స్పందించి, అవసరమైన ఆర్థిక, ఆర్థికేతర సహకారం అందించాలని ఆర్థిక, పంచాయతీరాజ్‌శాఖల ముఖ్య కార్యదర్శుల్ని హైకోర్టు ఆదేశించింది’అని లేఖలో పేర్కొన్నట్లు సమాచారం.

కోర్టు ఉత్తర్వుల్ని వారు అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని, ఉత్తర్వుల అమలుపై 15 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోర్టు ఆదేశించిన విషయాన్ని రమేశ్‌ కుమార్‌ గుర్తుచేశారు. ఆయన తాజా లేఖపై ప్రభుత్వ స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి.

ఇదీ చదవండి :

అధికార పార్టీ అరాచకాలను తిప్పికొడతాం: సోము వీర్రాజు

Last Updated : Nov 24, 2020, 5:44 AM IST

ABOUT THE AUTHOR

...view details