ఛలో అసెంబ్లీ పేరిట శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులను చట్టసభలకు రాకుండా అడ్డుకోవడం సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని శాసన సభాపతి తమ్మినేని సీతారాం చెప్పారు. అలా చేసిన వారు శిక్షార్హులు అవుతారన్నారు. చట్టసభలను ముట్టడిస్తాం, దాడి చేస్తామని బెదిరించడం సభ్యులకు సరైంది కాదన్నారు. సమావేశాలు సజావుగా జరిపేందుకు ప్రతిపక్షం సహకరించాలన్నారు. సభ్యులు తమ అభిప్రాయాలను అసెంబ్లీలో చెప్పుకొనే అధికారం ఉందని... ఆ దిశగా వ్యవహరించాలని కోరారు.
'నియమాలకు విరుద్ధంగా చట్టసభల్లోకి ప్రవేశిస్తే శిక్షార్హులే' - ap speaker latest news
ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలిపే హక్కు ప్రతి పౌరిడికీ ఉందని శాసన సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. ఆ నిరసనలు చట్టాలకు లోబడి ఉండాలని స్పష్టం చేశారు. అసెంబ్లీ ముట్టడిస్తామంటే... అది రాజ్యాంగ వ్యవస్థపై దాడి అవుతుందన్నారు. హక్కులు ఉన్నాయని... ఏదైనా చేస్తానంటే సరికాదని చెప్పారు.

చట్టసభల ఔన్నత్యాన్ని కాపాడేందుకు సభ్యులంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అగంతుకులు ప్రవేశించకుండా అడ్డుకునేందుకు 354, 355, 356 నియమాలు ఉన్నాయని.. వాటికి విరుద్ధంగా ఎవరైనా చట్టసభల్లోకి ప్రవేశిస్తే శిక్ష విధించే అధికారం ఉందన్నారు. ఛలో అసెంబ్లీ దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించినట్లు తెలిపారు. రైతుల సమస్యలు ఏమైనా ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి సానుకూలంగా పరిష్కరించుకోవాలని సూచించారు. బయటివారిని తీసుకువచ్చి శాసనసభపై దాడి చేసేందుకు ఎవరికీ హక్కు లేదన్నారు.