ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కరెంటు దొరక్కపోతే.. కోతలు తప్పవు: ఇంధన శాఖ కార్యదర్శి శ్రీధర్‌ - AP News

రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న విద్యుత్ కష్టాలపై ఇంధన శాఖ కార్యదర్శి బి.శ్రీధర్ స్పందించారు. విద్యుత్ కొతలు విధించడానికి గల కారణాలు చెప్పిన ఆయన.. ఈ పరిస్థితి ఎంత కాలం కొనసాగుతుందో కూడా వివరించారు.

AP energy department secretary
AP energy department secretary

By

Published : Apr 9, 2022, 5:41 AM IST

AP energy department secretary: విద్యుత్‌ ఎక్స్ఛేంజీలలో విద్యుత్‌ దొరకని సమయంలో గ్రామాల్లో గంట.. పట్టణాల్లో అరగంట కోతలు విధిస్తామని ఇంధన శాఖ ఇన్‌ఛార్జ్‌ కార్యదర్శి బి.శ్రీధర్‌ పేర్కొన్నారు. నెలాఖరు వరకు ఈ పరిస్థితి ఉంటుందన్నారు. మే నుంచి పవన విద్యుత్‌ ఉత్పత్తి పెరుగుతుందని, జూన్‌ నుంచి వర్షాలు కురిస్తే డిమాండ్‌ సాధారణ స్థాయికి చేరుతుందన్నారు. దీన్ని వినియోగదారులు అర్థం చేసుకుని సహకరించాలని కోరారు. ప్రస్తుతం కొరత ఉన్న మేరకు విద్యుత్‌ను సాధ్యమైనంత వరకు ఎక్స్ఛేంజీలలో కొని వినియోగదారులకు సరఫరా చేస్తామన్నారు. శుక్రవారం ఆయన ‘ఈనాడు-ఈటీవీ’తో మాట్లాడారు. రాష్ట్రంలో విద్యుత్‌ డిమాండ్‌ 235 మిలియన్‌ యూనిట్లు ఉందని.. అందుబాటులో ఉన్న వనరుల ద్వారా 180 ఎంయూలు వస్తుందన్నారు. ఇంకా 55 ఎంయూల కొరత ఉందని.. దీన్ని ఎక్స్ఛేంజీలలో కొంటున్నామని తెలిపారు. మార్కెట్‌లో దొరకని పరిస్థితుల్లో మాత్రమే గ్రిడ్‌ భద్రత కోసం కోతలు విధిస్తున్నట్లు చెప్పారు. ‘‘గత ప్రభుత్వ హయాంలో కుదుర్చుకున్న విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ) సమీక్షకు.. కోతలకు సంబంధం లేదు. ఆ విద్యుత్‌ను మేం తీసుకుంటున్నాం’’ అని వివరించారు.

విద్యుత్‌ పరిస్థితిపై సమీక్షించి ఒక విధానాన్ని తీసుకొచ్చాం. ఈరోజు నుంచి పరిశ్రమలకు కోతలు విధిస్తున్నాం. ఏడాదంతా ఉత్పత్తిలో ఉండే పరిశ్రమలు గత మార్చిలో వినియోగించిన విద్యుత్‌లో 50 శాతం మాత్రమే వినియోగించాలి. పగలు, రాత్రి పనిచేసే పరిశ్రమలకు రాత్రి షిఫ్ట్‌ రద్దు చేశాం. అలాగే ఒకరోజు సెలవు ఇచ్చే పరిశ్రమలు అదనంగా మరోరోజు విద్యుత్‌ హాలిడే ఇవ్వాలని చెప్పాం. పంటలు దెబ్బతినకుండా వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం ఇస్తున్నాం. గృహ వినియోగదారులకు కోతల బాధలు లేకుండా చేయాలని ప్రయత్నిస్తున్నాం. ప్రస్తుతం ఎదుర్కొంటున్న విద్యుత్‌ కొరత తాత్కాలికమే. సాధారణంగా ఏప్రిల్‌లో రావాల్సిన 240 ఎంయూల పీక్‌ లోడ్‌.. మార్చిలోనే వచ్చింది. వ్యవసాయ శాఖ అధికారుల సమాచారం ప్రకారం ఈ నెలాఖరుకు పంటల కోతలు పూర్తవుతాయి. దీంతో వ్యవసాయ బోర్ల వినియోగం తగ్గుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే పరిశ్రమలకు 22వ తేదీ వరకు పవర్‌ హాలిడే షెడ్యూల్‌ ఇచ్చాం. విద్యుత్‌ డిమాండ్‌ అంచనాలు వేయటంలో వైఫల్యం లేదు. డిమాండ్‌ 240 ఎంయూలు ఉంటుందని ముందుగానే ఊహించాం. కొవిడ్‌ తర్వాత అన్ని పరిశ్రమలు ఉత్పత్తిలోకి వచ్చాయి. బోర్ల కింద వ్యవసాయ విస్తీర్ణం పెరగటం కూడా ఒక కారణం. అన్ని రాష్ట్రాల్లో విద్యుత్‌ కొరత ఉండటంతో ఎక్స్ఛేంజీలలో దొరకటం లేదు. బొగ్గు కొరత కారణంగా ప్రైవేటు థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు మూతపడ్డాయి. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బొగ్గు ధరలు పెరిగాయి. ఎక్స్ఛేంజీలలో లభ్యత తగ్గటానికి ఇదే కారణం. పారిశ్రామికంగా మన కంటే ఎంతో అభివృద్ధి చెందిన గుజరాత్‌లో కూడా కోతలు విధిస్తున్నారు.

జెన్‌కో నుంచి పూర్తి స్థాయిలో ఉత్పత్తి..:గత వారంలో గృహ వినియోగదారులకు ఎక్కువ కోతలు పెట్టాం. ఇళ్లకు,వ్యవసాయానికి ఇబ్బంది లేకుండా సరఫరా చేయాలని ప్రభుత్వం చెప్పింది. అందుకే సర్దుబాటు కోసం పరిశ్రమలకు కోతలు పెట్టాం. జెన్‌కో థర్మల్‌ యూనిట్లు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. రోజుకు 80-85 ఎంయూల ఉత్పత్తి వస్తోంది. ఎన్‌టీపీసీ నుంచి 40 ఎంయూలు, సౌర విద్యుత్‌ 24 ఎంయూలు, పవన విద్యుత్‌ 11 ఎంయూలు, జల విద్యుత్‌ 6 ఎంయూలు వస్తున్నాయి. మొత్తం 180 ఎంయూల వరకు వస్తోంది.

ఇదీ చదవండి;రాష్ట్రంలో తారాస్థాయికి చేరిన కరెంటు కష్టాలు.. మనకే ఎందుకీ కోత?

ABOUT THE AUTHOR

...view details