ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'స్థానిక ఎన్నికలపై అసెంబ్లీలో తీర్మానం రాజ్యాంగ విరుద్ధం' - ap local body election news

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై నిర్ణయాధికారం ముమ్మాటికీ ఎన్నికల సంఘానిదేనని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ స్పష్టం చేశారు. రాజ్యాంగంలోని 243-కె అధికరణ ఇదే చెబుతోందంటూ..... గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు లేఖ రాశారు. ఎన్నికలు సకాలంలో నిర్వహించాల్సిన బాధ్యత రాష్ట్ర ఎన్నికల సంఘంపై ఉందన్నారు.

AP SEC Rameshkumar letter to Governor Bishwabhushan
గవర్నర్‌ బిశ్వభూషణ్‌కు ఎస్‌ఈసీ రమేశ్‌కుమార్‌ లేఖ

By

Published : Dec 6, 2020, 7:20 AM IST

ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల్ని ఫిబ్రవరిలో నిర్వహించలేమంటూ.... రాష్ట్ర ఎన్నికల సంఘం వైఖరిని తప్పుపడుతూ శాసనసభలో తీర్మానం ఆమోదించిన నేపథ్యంలో... గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ లేఖ రాశారు. ప్రభుత్వం శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టడం రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధమని.... కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని రమేశ్‌కుమార్‌ లేఖలో స్పష్టం చేశారు. ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వాన్ని సంప్రదించడం అంటే... కేవలం సమాచారం ఇవ్వడం మాత్రమేనంటూ వివిధ సందర్భాల్లో కోర్టులు చెప్పాయని... లేఖలో ప్రస్తావించారు. ప్రభుత్వ సమ్మతితోనే ఎస్ఈసీ ఎన్నికల షెడ్యూల్‌, తేదీలు ప్రకటించేలా పంచాయతీరాజ్‌ చట్టాన్ని సవరిస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తెచ్చే ప్రయత్నం చేస్తే.... అడ్డుకోవాలని గవర్నర్‌ను కోరారు. తెలంగాణ ప్రభుత్వం పంచాయతీరాజ్‌ చట్టంలో అలాంటి నిబంధన పొందుపరచడాన్ని సవాల్‌ చేస్తూ... ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం, మరికొందరు అక్కడి హైకోర్టులో వేసిన కేసు పెండింగ్‌లో ఉందని గుర్తుచేశారు. ఆర్డినెన్స్‌ ఇవ్వడంలో గవర్నర్‌కు విశేషమైన పాత్ర ఉందని..... రమేశ్‌కుమార్‌ తన లేఖలో గుర్తుచేశారు. ప్రభుత్వ ప్రతిపాదనతో గవర్నర్‌ సంతృప్తి చెందితేనే ఆర్డినెన్స్‌ జారీ చేయాలని చాలా సందర్భాల్లో కోర్టులు చెప్పాయన్నారు. ఈ నేపథ్యంలో పూర్వాపరాలన్నీ ఆలోచించి ప్రభుత్వానికి తగిన సలహా ఇవ్వాలని గవర్నర్‌ను కోరారు. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించవద్దని ప్రభుత్వానికి సలహా ఇవ్వదగిన అధికారం, ఇవ్వాల్సిన బాధ్యత గవర్నర్‌కు ఉన్నాయని రమేశ్‌కుమార్‌ లేఖలో పేర్కొన్నారు.

గవర్నర్‌ బిశ్వభూషణ్‌కు ఎస్‌ఈసీ రమేశ్‌కుమార్‌ లేఖ

కేంద్ర ఎన్నికల సంఘంతో సమానమైన అధికారాలే... రాష్ట్ర ఎన్నికల సంఘాలకూ వాటి పరిధిలో ఉంటాయని కిషన్‌సింగ్‌ తోమర్‌ వర్సెస్‌ అహ్మదాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కేసులో సుప్రీంకోర్టు తీర్పిచ్చిందని.... రమేశ్‌కుమార్‌ గుర్తుచేశారు. చట్టసభలు, స్థానిక సంస్థలను వేర్వేరుగా చూడలేమని..... వాటికి సమాన ప్రతిపత్తి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం.. కేంద్ర ప్రభుత్వ సమ్మతితో ఎన్నికల ప్రకటన చేయదని లేఖలో వివరించారు. రాజస్థాన్‌లో ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అనుకూలంగా ఆ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లగా... అక్కడ హైకోర్టు తీర్పునే సమర్థించిందని రమేశ్‌కుమార్‌ తన లేఖలో ప్రస్తావించారు.

అభివృద్ధి పనుల ప్రారంభానికి ఎస్ఈసీ అనుమతి నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ సుప్రీంకోర్టులో ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ పెండింగ్‌లో ఉందని రమేశ్‌కుమార్‌ పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై దాఖలైన మరో పిటిషన్‌ హైకోర్టులో ఉందని... అలాంటి సమయంలో శాసనసభలో తీర్మానం చేయడం కోర్టు ధిక్కరణ అవుతుందని... గవర్నర్‌కు రాసిన లేఖలో ఎస్ఈసీ రమేశ్‌కుమార్‌ వివరించారు.

ఇదీ చదవండి:

దయాదాక్షిణ్యం కాకూడదు : చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details