పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై క్షేత్రస్థాయి పర్యటనలోభాగంగా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ శుక్రవారం కర్నూలులో పర్యటించారు. జిల్లాలో కరోనా కట్టడిలో వైద్యారోగ్య సిబ్బంది కృషిని ప్రశంసించారు. జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఏకగ్రీవాల పేరిట రాష్ట్రంలో విషసంస్కృతిని వ్యాప్తి చేస్తున్నారని నిమ్మగడ్డ అన్నారు. ఇదే విషయంపై రాజకీయ పార్టీలన్నీ గురువారం గవర్నర్‌ను కలిసి ఆందోళన వ్యక్తం చేశాయని గుర్తుచేశారు. వీటికి సంబంధించి పత్రికల్లో వచ్చిన ప్రకటనలపైనా స్పందించాలని కోరిన విషయం... తన దృష్టికి వచ్చిందన్నారు.
ఎలక్షన్ కమిషన్‌కు ఏకగ్రీవాలపై నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉన్నాయని నిమ్మగడ్డ అన్నారు. కర్నూలు జిల్లాలో 2006తో పోలిస్తే 2013లో ఏకగ్రీవాల సంఖ్య 14 శాతానికి తగ్గిందన్నారు. ప్రజల్లో అవగాహన పెరగటం వల్ల ఏకగ్రీవాలు తగ్గుముఖం పడుతున్నాయన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ.. భిన్నాభిప్రాయాల వల్ల బాగుపడుతుందని... నోరు నొక్కటం ఏకాభిప్రాయం కాదన్నారు.
ఏకగ్రీవాలపై వివిధ పార్టీల నేతలు గవర్నర్‌ను కలిశారు. ఏకగ్రీవాల కోసం భారీగా ప్రకటనలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏకగ్రీవాలపై ప్రకటన ఇచ్చిన అధికారులను వివరణ కోరా. మాకు తెలియకుండా ఇలాంటి పత్రికా ప్రకటనలు ఎలా ఇస్తారు..?. సామరస్యంగా ఏకగ్రీవాలు చేయడం మంచి పద్ధతి. బలవంతం చేసి, భయపెట్టి ఏకగ్రీవాలు చేయడం గర్హనీయం. భిన్నాభిప్రాయాల నుంచి ఏకాభిప్రాయ సాధనే ప్రజాస్వామ్యం. -నిమ్మగడ్డ రమేశ్ కుమార్, ఎస్ఈసీ
ఇటీవల ఎన్నికలు జరిగిన రాజస్థాన్, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణల్లో ఏకగ్రీవాల పేరిట ముందుకెళ్లిన సంస్కృతి కనిపించలేదని నిమ్మగడ్డ అన్నారు. ఈ విషసంస్కృతికి ఇకనైనా అడ్డుకట్ట వేయాలని కోరారు. ఏకగ్రీవాలంటూ అధికార దుర్వినియోగానికి పాల్పడేవారిపై నిఘా పెట్టాలని కలెక్టర్‌ను ఆదేశించినట్లు నిమ్మగడ్డ తెలిపారు.