ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాజ్యాంగం కల్పించిన విశేషాధికారాలను తప్పక వినియోగిస్తా: ఎస్ఈసీ

ఏదో మొక్కుబడిగా కాకుండా అన్ని వర్గాల వారు ఎన్నికల్లో భాగస్వామ్యులు అవ్వాలన్నదే తన నిశ్చిత అభిప్రాయమని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ స్పష్టం చేశారు. అందుకే జిల్లాల వారీ పర్యటనలు చేసి, ప్రజల్లో విశ్వాసం నింపే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. ఇదే సమయంలో తన పరిధేంటో తనకు తెలుసన్న ఆయన.. ఎన్నికలు స్వేచ్ఛగా జరగడానికి.. ఆ పరిధి మేరకు రాజ్యాంగం కల్పించిన విశేషాధికారాలను తప్పక వినియోగిస్తానని చెప్పారు.

ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌
ఏపీ స్థానిక ఎన్నికలు 2021

By

Published : Feb 4, 2021, 4:02 AM IST

Updated : Feb 4, 2021, 6:17 AM IST

ప్రజాస్వామ్యానికి తొలిమెట్టు అయిన పంచాయతీ వ్యవస్థలు ఎంత బలంగా ఉంటే.. మిగిలిన వ్యవస్థలన్నీ మరింత సమర్థంగా పనిచేయడానికి వీలుంటుందని... ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ అభిప్రాయపడ్డారు. జిల్లాల పర్యటనలో భాగంగా చిత్తూరు జిల్లాలో ఎన్నికల సన్నద్ధత, ఏర్పాట్లపై కలెక్టర్‌, ఎస్పీ, ఇతర అధికారులతో రమేశ్‌కుమార్‌ సమీక్ష నిర్వహించారు.

గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా, మరింత పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించాలని అధికారులకు ఎస్ఈసీ సూచించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో జరిగిన ఏకగ్రీవాలపై గుడ్డిగా నిర్ణయం తీసుకోమని వివిధ కోణాల్లో పరిశీలించిన అనంతరం తీసుకుంటామన్నారు. ఇదే సమయంలో తనపై వస్తున్న విమర్శలను పట్టించుకోనన్న ఆయన.. రాజ్యాంగం నిర్దేశించిన పరిధి మేరకు తన విధులను నిర్వర్తిస్తానని స్పష్టం చేశారు. అదే ప్రక్రియలో నిమగ్నమైన ఇతర అధికారులు, సిబ్బంది పనిచేయాలని కోరుకుంటున్నట్లు చెప్పిన నిమ్మగడ్డ.. అలానే చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కాని పక్షంలో వారు మరింత సమర్థంగా బాధ్యతలు నిర్వహించేందుకు.. తన విశేషాధికారాలను తప్పక వినియోగిస్తానని.. ఇందులో ఎటువంటి సంశయం లేదని స్పష్టం చేశారు.

చిత్తూరు జిల్లా పర్యటనకు వచ్చిన ఎస్ఈసీని కలిసిన పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం నేతలు కలిశారు. నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రి అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు స్థానిక అధికారులపై...ఎస్ఈసీకి ఫిర్యాదు చేశారు. అంతకు ముందు తిరుచానూరు పద్మావతి అమ్మవారిని ఎస్ఈసీ దర్శించుకున్నారు. ఆలయ మహాద్వారం వద్ద తితిదే జేఈవో బసంత్‌కుమార్‌.. నిమ్మగడ్డకు స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేసిన పండితులు.. వేదాశీర్వచనం పలికారు. నేడు నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ఎస్‌ఈసీ పర్యటన సాగనుంది.

ఇదీ చదవండి

పదోతరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

Last Updated : Feb 4, 2021, 6:17 AM IST

ABOUT THE AUTHOR

...view details