సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతం సవాంగ్‌కు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ లేఖ రాశారు. 9 మంది అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇద్దరు కలెక్టర్లు, ఎస్పీ, ఇద్దరు డీఎస్పీలు, నలుగురు సీఐలపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
కళంకిత అధికారులను కొనసాగిస్తే ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని లేఖలో తెలిపారు. ఎస్‌ఈసీ పేర్కొన్న అధికారుల్లో గుంటూరు, చిత్తూరు కలెక్టర్లు, తిరుపతి అర్బన్ ఎస్పీ, పలమనేరు, శ్రీకాళహస్తి డీస్పీలు, మాచర్ల, పుంగనూరు, రాయదుర్గం, తాడిపత్రి సీఐల పేర్లు ఉన్నాయి.
అప్పట్లోనే లేఖ....
గతంలో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత విధి నిర్వహణలో 9 మంది అధికారులు అలసత్వం వహించారని.. వారిపై చర్యలు తీసుకోవాలని అప్పట్లోనే సీఎస్, డీజీపీకి ఎస్‌ఈసీ నిమ్మగడ్డ లేఖ రాశారు. అయితే వారిని ఎన్నికల విధుల నుంచి తొలగించకపోవడాన్ని ఆయన తీవ్రంగా పరిగణించారు. రేపటి నుంచి పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ప్రక్రియ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో 9 మంది అధికారులను ఎన్నికల విధుల నుంచి తొలగించాలని సూచించారు. ఆయా స్థానాల్లో మూడేసి చొప్పున పేర్లు ప్రతిపాదించాలని సీఎస్, డీజీపీని లేఖలో ఎస్‌ఈసీ కోరారు.
ఇదీ చదవండి
ఎస్‌ఈసీతో సమావేశానికి పంచాయతీరాజ్ అధికారుల గైర్హాజరు