స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఓటర్ల జాబితాను పంచాయతీరాజ్ కమిషనర్ ఉద్ధేశపూర్వకంగా సిద్ధం చేయలేదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. 2019 జనవరి 1న ప్రచురించి.. దాన్ని గతేడాది మార్చి 7న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ వరకు ఉన్న జాబితానే ఇప్పుడు పంచాయతీ ఎన్నిలకు వినియోగించనున్నట్లు వెల్లడించారు. 2021 ఓటరు జాబితాను నిర్ధేశిత కాలగడువులోగా సిద్ధం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు డివిజన్ బెంచ్‌కు అండర్‌టేకింగ్ ఇచ్చిందని.. కానీ జాబితాను సిద్ధం చేయకుండా పంచాయతీరాజ్ శాఖ, ఆ శాఖ కమిషనర్ ఉద్దేశపూర్వకంగా దాన్ని పూర్తి చేయకుండా హైకోర్టుకు ప్రభుత్వం సమర్పించిన అండర్‌టేకింగ్‌నూ ఉల్లంఘించారన్నారు. ఈ పాలనాపరమైన వైఫల్యంపై ఎన్నికల సంఘం నేరుగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
తాజాగా 18ఏళ్లు నిండిన యువతకు ఓటు హక్కు కల్పిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఓటరు జాబితాను సిద్ధం చేసిందని.. ఈ నెల15 తుదిజాబితాను ప్రచురించిందన్నారు. ఈ జాబితాను అడాప్ట్ చేసుకుని పంచాయతీ ఎన్నికల కోసం ఈ నెల 25లోగా ఓటరు జాబితాను సిద్ధం చేయమని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్‌ను గతేడాది నవంబరులోనే ఎన్నికల సంఘం ఆదేశించిందని గుర్తుచేశారు. ఇందుకోసం ఆ శాఖకు కార్యనిర్వహక మార్గదర్శకాలనూ జారీ చేసిందన్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం ప్రచురించిన జాబితాను ఇవ్వాలని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని గతేడాది నవంబరులోనే కోరింది. కానీ.. ఆ జాబితాను తీసుకునేందుకు సరైన చర్యలను పంచాయతీరాజ్ శాఖ, ఆ శాఖ కమిషనర్ తీసుకోలేదు. దీనిపై కమిషనర్‌ను ఈ ఏడాది జనవరి 6న వివరణ కోరిగా.. కమిషనర్ నుంచి గానీ, పంచాయతీరాజ్ శాఖ నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి స్పందనా లేదన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాలను ఉల్లంఘించాలని వారు నిర్ణయించుకున్నట్లు ఈ చర్యతో తేటతెల్లమవుతోందని పేర్కొన్నారు.