ప్రైవేటు పాఠశాలల్లో అడ్మిషన్ల పేరుతో తమ ఉపాధ్యాయులను విద్యార్థుల ఇళ్లకు పంపించటం మానుకోవాలని రాష్ట్ర పాఠశాల విద్యనియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ ఆదేశించింది. కొన్ని ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు తమ సిబ్బంది వేతనాన్ని అడ్మిషన్లతో ముడిపెట్టి వేధించటం సరికాదని కమిషన్ ఛైర్మన్ జస్టిస్ ఆర్ కాంతారావు అన్నారు.
ఈ అంశంపై కమిషన్ సభ్యులతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్షించిన ఆయన.. నిబంధనలను ఉల్లంఘించి ఈ తరహా చర్యలకు పాల్పడితే గుర్తింపు రద్దు చేసేలా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో ఈ తరహా చర్యలకు పాల్పడే ప్రైవేటు పాఠశాలల గురించి apsermc.ap.gov.in పోర్టల్‌కు ఫిర్యాదులు పంపాలని ఆయన కోరారు.