రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో వర్షం కురిసింది. కృష్ణా జిల్లా గన్నవరంలో రాత్రి కురిసిన అకాల వర్షానికి.. ముస్తాబాద్, సావరగూడెం, సూరంపల్లి, నున్న గ్రామాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయింది. ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందని.. నెల రోజుల నుంచి పంటను కాపాడుకోలేక ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లా కదిరిలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. అడపాల వీధిలో నివాసాల మధ్యలో ఉన్న కొబ్బరి చెట్టుపై పిడుగు పడింది. పిడుగు ధాటికి ఒక్కసారిగా మంటలు వ్యాపించి చెట్టు దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను అదుపు చేశారు. విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. అడుగంటిన జలాశయాల్లో నీటి నిల్వలు పెరుగుతున్నాయి.
జలాశయాలకు జలకళ..