ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం... కొత్త లైన్లకు నిధుల కేటాయింపులో మొండిచేయి - AP railway projects in budget 2022

AP railway projects in budget: రైల్వే బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కి కేంద్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసింది. కొత్త లైన్లకు నిధుల కేటాయింపులో మొండిచేయి చూపింది. ఇప్పటికే తమ వాటా చాలా వెచ్చించామని... ఇప్పుడు రాష్ట్ర వాటా కింద వచ్చే ఆర్థిక సంవత్సరంలో నిధులిస్తేనే పనులు చేస్తామని చెప్పకనే చెప్పింది.

AP railway projects in budget
AP railway projects in budget

By

Published : Feb 5, 2022, 5:46 AM IST

AP railway projects in budget: రైల్వే బడ్జెట్‌లో మన రాష్ట్రానికి మరోసారి అన్యాయం జరిగింది. కొత్త లైన్లకు నిధుల కేటాయింపులో కేంద్రం మొండిచేయి చూపింది. ఇప్పటికే తమ వాటా చాలా వెచ్చించామని, ఇప్పుడు రాష్ట్ర వాటా కింద వచ్చే ఆర్థిక సంవత్సరంలో నిధులిస్తేనే పనులు చేస్తామని చెప్పకనే చెప్పింది. కొన్నేళ్లుగా వివిధ రైల్వే ప్రాజెక్టులకు రాష్ట్రం రూపాయి ఇవ్వడం లేదు. దీంతో ఆయా కొత్త లైన్లలో ఈసారి పనులు జరిగే దాఖలాలు లేవు. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించి మూడేళ్లవుతోంది. దీనికి రూ.273 కోట్లు అవసరమని అధికారులు డీపీఆర్‌ సిద్ధం చేసి రైల్వే బోర్డుకు పంపారు. ఈ నిధుల మంజూరుతోపాటు ఫలానా తేదీ నుంచి కొత్త జోన్‌ అమల్లోకి వస్తుందని ప్రకటించాల్సి ఉంది. అయితే డీపీఆర్‌ రైల్వే బోర్డు పరిశీలనలోనే ఉందని అధికారులు చెబుతున్నారు. గత బడ్జెట్‌లో రూ.40 లక్షలు, ఈసారి కూడా రూ.40 లక్షలు మాత్రమే దీనికి కేటాయించారు.

భూసేకరణ చేయరు.. నిధులివ్వరు

  • కోటిపల్లి-నర్సాపురం కొత్త లైన్‌ ప్రాజెక్టులో 25శాతం వాటా వెచ్చించడంతోపాటు 206 హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉంది. ఈ పనులు కాకపోవడంతో రెండు దశాబ్దాల కిందట మొదలైన లైను పూర్తయ్యేందుకు ఇంకెన్ని దశాబ్దాలు పడుతుందనేది ప్రశ్నార్థకమే.
  • నడికుడి-శ్రీకాళహస్తి ప్రాజెక్టులో 50శాతం వాటాతోపాటు 991 హెక్టార్ల రెవెన్యూ భూమి, 119 హెక్టార్ల అటవీ భూమి సేకరించి రైల్వేశాఖకు అప్పగించడంలో జాప్యం వల్ల పనులు ఆగిపోయాయి. ఇలాగైతే ఈ లైన్‌ పూర్తయ్యేందుకు మరో దశాబ్దంపట్టినా ఆశ్చర్యపోవాల్సింది లేదు.
  • కడప-బెంగళూరు కొత్త లైన్‌ ప్రాజెక్టులోని 50 శాతం నిధులు, 1,084 హెక్టార్ల రెవెన్యూ భూమి, 56 హెక్టార్ల అటవీ భూమి సేకరించి ఇవ్వకపోవడంతో పనులు నిలిపేశారు. కడప-పెండ్లిమర్రి మధ్య 21కి.మీ.జరిగిన పనులు తర్వాత అడుగు ముందుకు పడలేదు. నిర్మాణ వ్యయం ఎక్కువగా ఉన్నందున ఈ ప్రాజెక్టు బదులు ముద్దనూరు నుంచి ముదిగుబ్బ వరకు కొత్త లైన్‌ నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.
  • అనంతపురం జిల్లా రాయదుర్గంనుంచి కళ్యాణదుర్గం మీదుగా కర్ణాటకలోని తుముకూరు వరకు 207 కి.మీ. కొత్త లైన్‌లో రాయదుర్గంనుంచి కదిరి దేవరపల్లి వరకు 63 కి.మీ.పూర్తయింది. ఇందులో మన రాష్ట్ర పరిధిలోని ఇంకా 34 హెక్టార్ల భూసేకరణ, రూ.39 కోట్లు వాటా ఇవ్వకపోవడంతో పనులు జరగడం లేదు. కర్ణాటకలో కూడా భూసేకరణలో జాప్యం వల్ల లైన్‌ పూర్తయ్యేందుకు చాలాకాలం పట్టే అవకాశాలున్నాయి.
  • పైన పేర్కొన్న నాలుగు ప్రాజెక్టులకు రాష్ట్ర వాటా వెచ్చించే పరిస్థితి లేదని, నిధులన్నీ రైల్వేశాఖ భరించాలని రాష్ట్ర ప్రభుత్వం గతేడాది లేఖ రాసినట్లు తెలిసింది. అయితే దీనిపై ఇప్పటివరకు రైల్వేశాఖ నుంచి ఎలాంటి నిర్ణయం వెలువడలేదు.

ఈ పనులు సాగుతున్నాయ్‌..

  • విజయవాడ-గుడివాడ-భీమవరం-నర్సాపురం, గుడివాడ-మచిలీపట్నం, భీమవరం-నిడదవోలు రెండో లైను, విద్యుదీకరణ వ్యయంలో 50శాతం రాష్ట్రవాటాగా ఇవ్వాల్సి ఉంది. అయితే రైల్వేశాఖ మాత్రం ప్రాధాన్య ప్రాజెక్టుల కింద ఈ పనులు వేగంగా చేస్తోంది. ఇప్పటికే 144 కి.మీ.పనులు పూర్తయ్యాయి.

కోచ్‌ ఫ్యాక్టరీ ఎప్పుడయ్యేనో..?

ఎనిమిదేళ్ల కిందట కిందట రైల్వేశాఖ సహాయమంత్రిగా కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి ఉన్నప్పుడు కర్నూలుకు వ్యాగన్ల మరమ్మతు పరిశ్రమ మంజూరైంది. అది పూర్తి కాలేదు. పరిశ్రమకు అనుసంధానించేలా రైల్వేట్రాక్‌ పనులు చేస్తున్నారు. దీని మొత్తం అంచనా వ్యయం రూ.560 కోట్లుకాగా.. గతేడాది మార్చి చివరినాటికి రూ.106 కోట్లు వెచ్చించారు. ఈసారి బడ్జెట్‌లో రూ.58 కోట్లు కేటాయించారు. పరిశ్రమ సిద్ధమయ్యేందుకు మరింత సమయం పట్టే అవకాశాలున్నాయి.

ఇదీ చదవండి:పీఆర్సీ నివేదికపై రాని స్పష్టత... నేడు మరోసారి భేటీ

ABOUT THE AUTHOR

...view details