Special policing in AP: పోలీసింగ్ అంటే... నేరాల్ని నియంత్రించాలి. శాంతి భద్రతల్ని పరిరక్షించాలి. అసాంఘిక కార్యక్రమాలపై ఉక్కుపాదం మోపాలి. అరాచక శక్తుల్ని అణచివేయాలి. కేసుల్ని శరవేగంగా ఛేదించి దోషుల్ని పట్టుకోవాలి. వారికి శిక్షలు పడేలా చూడాలి. కానీ... ఆంధ్రప్రదేశ్ పోలీసులు దాని అర్థాన్నే మార్చేశారు. అధికార పార్టీ నాయకుల సేవలో తరించడం, వారి ఆదేశాల్ని అమలు చేయడమే అసలైన పోలీసింగ్ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. నేరాలకు బదులు ప్రతిపక్ష పార్టీలను నియంత్రిస్తున్నారు. అసాంఘిక కార్యకలాపాలపై కాకుండా.... ప్రజాసంఘాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. అరాచకశక్తులను వదిలేసి... హక్కుల కోసం పోరాడుతున్న ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల్ని అణచివేస్తున్నారు. రాజకీయ పోలీసింగ్‌కే ప్రాధాన్యం ఇస్తున్నారు. వాటి ఫలితంగానే రాష్ట్రంలో నేరాలు, ఘోరాలు పెచ్చరిల్లుతున్నాయి. కొన్నాళ్లుగా వరుసగా జరుగుతున్న సంచలన నేర ఘటనల్ని చూస్తే రాష్ట్రంలో అసలు పోలీసింగ్ ఉందా? అనే సందేహం కచ్చితంగా కలుగుతుంది.
* ఆగస్టు 7, 2022 నంద్యాల పట్టణంలో రాత్రి 9 నుంచి 10 గంటల సమయం. ఆరుగురు వ్యక్తులు ఒకరిని నడిరోడ్డుపై తరుముకుంటూవెళ్లారు. ఆటోలో ఎత్తుకెళ్లి కత్తులతో పొడిచి చంపారు. వెంటాడింది రౌడీషీటర్లు, వారి చేతిలో చనిపోయింది కానిస్టేబుల్ సురేంద్ర.! పోలీస్ యంత్రాంగమంతా ఉండే జిల్లా కేంద్రంలో, అదీ పోలీస్‌ను నడిరోడ్డుపై వెంటాడి చంపితే దిక్కులేదు. అదే రోడ్డుపై ఓ గస్తీ కానిస్టేబుల్ ఉండిఉంటే పరిస్థితి ఎలా ఉండేది?
* ఆగస్టు 17,2022 ప్రభుత్వం పాలనా రాజధానిగా ప్రవచించే విశాఖపట్నంలోని ఎంవీపీ కాలనీలో ఓ రౌడీషీటర్‌ను అందరూచూస్తుండగానే గొంతుకోసి చంపారు.
* ఆగస్టు 27,2022
నెల్లూరు నగరంలో శ్రీరామ క్యాంటీన్ నిర్వాహకుడు కృష్ణారావును రెక్కీ వేసి మరీ చంపేశారు. అర్ధరాత్రి క్యాంటీన్ నుంచి ఇంటికి వెళ్లిన కృష్ణారావును గుమ్మంలోనే కొట్టిచంపి ఆ తర్వాత ఇంట్లోకి వెళ్లి అతని భార్యనూ హతమార్చారు.
* ఆగస్టు 27, 2022
ఆదోని పట్టణంలోని షారాఫ్ బజార్‌లో బంగారు దుకాణానికి కన్నం వేసి రూ.కోటి విలువైన బంగారు, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. అర్ధరాత్రి దాటాక రెండున్నర గంటల సమయంలో చోరీకి పాల్పడ్డారు.
* ఆగస్టు 29, 2022
చీరాల ఆంధ్రరత్న రోడ్డులో విజయలక్ష్మి అనే మహిళ దోపిడీ దొంగలు.. ఇంట్లోకి చొరబడి రాత్రి 7 గంటల ప్రాంతంలో చంపేశారు. ఆమె ఒంటిపై ఉన్న ఆభరణాలు ఎత్తుకెళ్లారు.
శాంతి భద్రతలను మరచి.. అధికార పార్టీ సేవలో తరిస్తోన్న ఏపీ పోలీసులు పోలీసింగ్ వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనం
దోపిడీలు,దొమ్మీలు, హత్యలు.. రాష్ట్ర పోలీసింగ్ వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఏ మాత్రం పోలీస్ గస్తీ ఉన్నా, కనీస నిఘా, భద్రత, బీట్ల వ్యవస్థ ఉన్నా ఇలాంటివి చోటుచేసుకునే అవకాశం ఉండదు. మరిరాష్ట్రంలో పోలీసులు లేరా అంటే.. లేంకేంఉన్నారు. మరి వాళ్లం చేస్తున్నారన్నదే ఇక్కడ ప్రశ్న. పోలీస్ బాస్‌ల దృష్టిలో పోలీసింగ్ అంటే రాజకీయ పోలీసింగే అన్న పరిస్థితి ఉంది. డీజీపీ మొదలుకుని ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, కానిస్టేబుల్, హోంగార్డుల వరకూ నేరనియంత్రణ, నేరాల ఛేదన వంటి మూల విధులు పక్కనపెట్టేశారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వాళ్ల దృష్టంతా ప్రభుత్వాన్ని విమర్శించే గొంతులు నొక్కడం.. నిరసనంటూ రోడ్డెక్కనీయకుండా కట్టడిచేయడంపైనే ఉంటోంది.
రాజకీయ ఒత్తిడితో ప్రతిపక్షాలపై
రాజకీయ నేతల ఆందోళనలే తీసుకోండి.. ఎవరైనా ఒక ధర్నాకు బయల్దేరారా ఇక అంతే రెండ్రోజుల ముందే వాళ్లకు నోటీసులిస్తారు. ఇళ్లుకదలడానికి వీళ్లేదంటూ.. గృహనిర్బంధం చేస్తారు. పోలీసులను ఇంటి చూట్టూ మోహరిస్తారు. విపక్ష నేతల్ని గడపదాటనీయకుండా చేయడానికే వాళ్ల సమయం సరిపోతోంది. ఈలోపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్కడో ఒకచోట పోస్టులుపెడితే ఏదో ఉగ్రవాదుల్ని పట్టుకున్నట్లు.. వారిని వెంటాడడం, అరెస్ట్ చేయడం? అర్థరాత్రిళ్లు న్యాయమూర్తుల ముందు ప్రవేశపెట్టడం? ఇక గస్తీలు ఎక్కడనేరగాళ్లపై నిఘాకు సమయం ఎక్కడ?
ఉద్యోగులకు తప్పని తిప్పలు
రాజకీయ నేతలేకాదు.. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షకసంఘాలెవరు నిరసనకు పిలుపునిచ్చినా ఇదే పరిస్థితి. నోటీసులతో మొదలై.. నిర్బంధాలు, బైండోవర్లు, అరెస్టులు.. ఇదే అసలు పనైపోయింది. సీపీఎస్ రద్దు కోసం ఉద్యోగ సంఘాలు ఇటీవల సీఎం ఇంటి ముట్టడి పిలుపునిస్తే, పోలీసుల హడావుడి అంతా ఇంతాకాదు. పాఠశాలలు, ఇళ్లు ఇలా ఉపాధ్యాయులను నీడలా వెంటాడారు. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో తనిఖీలు చేశారు. దాదాపు వారంరోజులు పోలీసులకు ఇదే పని. చివరికి పోలీస్ నిర్బంధాన్ని తట్టుకోలేక ఉద్యోగ సంఘాలు నిరసననే విరమించుకున్నాయంటే రాష్ట్రంలో పోలీసింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇలా ప్రభుత్వ పెద్దలు, వైకాపా నేతలను వ్యతిరేకించేవారిని అణచివేయడంలో పోలీసులు నిమగ్నమవడం అసాంఘిక శక్తులకు అదునుగా మారింది. వారిపై నిఘా కరవైంది. పగటిపూట, రాత్రి వేళల్లో పోలీసుల గస్తీ నామమాత్రంగా మారింది. రాజకీయ విధుల్లో ఎక్కువమంది తలమునకలై ఉండటంతో చాలాచోట్ల బీట్ల సంఖ్య తగ్గిపోయింది. రాజకీయ పోలీసింగ్‌లో పడిపోయి రౌడీషీటర్లు, పాత నేరగాళ్ల కదలికలపై కన్నేయడంలేదు. చాలాచోట్ల సీసీ కెమెరాలు లేవు. ఉన్నవీ సరిగ్గా పనిచేయడంలేదు కనీసం వాటి మరమ్మతులపైనా దృష్టిసారించట్లేదు. గతంలో ఎక్కడైనా వరుస దొంగతనాలు జరుగుతుంటే.. మిగతా ప్రాంతాల్లో ప్రజల్ని పోలీసులు అప్రమత్తం చేసేవారు. ఇప్పుడు ఎక్కువ శాతం ప్రొటోకాల్ విధులు, అధికార పార్టీ నాయకులు చెప్పే పనులు చేయడానికే ప్రాధాన్యమిస్తున్నారు. ఫలితంగారాష్ట్రంలో నేరాలు పెరిగిపోతున్నాయి. జాతీయ నేర గణాంక సంస్థ తాజాగా గణాంకాలే దీనికి నిదర్శనం.2020తో పోల్చితే, 2021లో బందిపోటు దొంగతనాలు ఏకంగా 89 శాతం పెరిగాయి, దొంగతనాలు 24 శాతం, హత్యాయత్నాలు 17.71 శాతం, అపహరణలు 13 శాతం, హత్యలు 12.07 శాతం ఎక్కువయ్యాయి.
ఇవీ చదవండి: