లాక్‌డౌన్ రెండో రోజున రాష్ట్రవ్యాప్తంగా ప్రజారవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించగా... అక్కడక్కడ ప్రజలు వారి వాహనాలపై రోడ్లమీదకు వచ్చారు. వారిని ఇళ్లకే పరిమితం చేసేందుకు పోలీసులు కాస్త కఠినంగా వ్యవహరించారు.
ఉత్తరాంధ్రలో...
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో రెవెన్యూ అధికారులు, పోలీసులతో కలిసి వీధుల్లో గస్తీ నిర్వహించారు. నిత్యావసరాలు కాని దుకాణాలను మూసివేయించి నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. విజయనగరంలో ఎక్కడికక్కడ పోలీసులు ద్విచక్రవాహనదారులను ఆపి సరైన కారణం చెప్తేనే అనుమతించారు. ఎక్కడా జనం పోగవకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో ఇతర ఊళ్ల వారు ప్రవేశించకుండా ముళ్లకంచెలు వేశారు. విశాఖలో నిష్కారణంగా రోడ్లపైకి వచ్చిన యువతతో పోలీసులు గుంజీలు తీయించారు.
తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో...
తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు, రాజమహేంద్రవరంలో రోడ్లపైకి వచ్చిన వాహనదారులను అడ్డుకున్న పోలీసులు... మైకు ద్వారా అవగాహన కల్పించారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి, టి-నరసాపురం, లింగపాలెం మండలాల్లోని వివిధ గ్రామాల్లో, సరిహద్దుల్లోనే ప్రజలు కంచెలు ఏర్పాటు చేసుకున్నారు. బుట్టాయగూడెం మండలం కోయ అంకంపాలెం గ్రామం స్వీయ నిర్బంధంలోనే సాగింది.