హైదరాబాద్ నుంచి రాష్ట్రానికి వచ్చిన ప్రయాణికులను గరికపాడు చెక్‌పోస్టు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో అర్ధరాత్రి వరకూ ఆందోళన కొనసాగింది. క్వారంటైన్‌కు ఒప్పుకుంటేనే అనుమతిస్తామన్న ఉన్నతాధికారుల ఆదేశాలతో... బాధితులు గంటల పాటు ఇబ్బందులు పడ్డారు.
ఉన్నతాధికారులు అనుమతిస్తేనే
హైదరాబాద్‌లో హాస్టళ్లు, మెస్‌లు మూసివేయాలన్న యజమానుల నిర్ణయంతో... అక్కడ ఉంటున్నవారంతా స్వస్థలాలకు వరుస కట్టారు. తెలంగాణ పోలీసుల వద్ద అనుమతి తెచ్చుకుని... సొంత వాహనాల్లో రాష్ట్రానికి బయల్దేరారు. 2.. 3 గంటల్లో ఇళ్లకు చేరుకుంటామనుకుంటున్న వారిని సరిహద్దు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర సరిహద్దులు మూసివేసినట్లు వివరించారు. మరీ ముఖ్యమైన పనులుంటే ఉన్నతాధికారుల అనుమతి కావాలని తేల్చి చెప్పారు. సాయంత్రం 4 గంటల నుంచి వచ్చిన వాహనాలన్నీ నిలిపివేయడం వల్ల హైదరాబాద్ - విజయవాడ రహదారిపై 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సుమారు వేయి మందికి పైగా ప్రయాణికులతో... రహదారి కిక్కిరిసిపోయింది.
క్వారంటైన్‌లో ఉంటేనే అనుమతి
గరికపాడు చెక్‌పోస్టు వద్దకు చేరుకున్న కృష్ణా జిల్లా సబ్‌కలెక్టర్ ధ్యాన్‌చంద్... రాష్ట్రంలోకి అడుగుపెట్టాలంటే కచ్చితంగా క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని ప్రయాణికులకు సూచించారు. అందరి వివరాలు తీసుకుని... నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రానికి తరలిస్తామని స్పష్టం చేశారు. అయోమయంలో పడిన ప్రయాణికులు.... అధికారులతో వాగ్వాదానికి దిగారు. సూర్యాపేట జిల్లా ఎస్పీ ఆర్.భాస్కరన్... గరికపాడు వద్దకు చేరుకుని నందిగామ డీఎస్పీతో మాట్లాడారు. ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం... క్వారంటైన్ తప్పదని ఏపీ పోలీసులు తేల్చి చెప్పారు.