విద్యుత్ రంగం సంక్షోభంలో కూరుకుపోవడానికి సీఎం జగనే కారణమని ఏపీ పీఏసీ ఛైర్మన్, తెదేపా సీనియర్ నేత పయ్యావుల కేశవ్ ఆరోపించారు. రాష్ట్రంలోని సమస్యను అంతర్జాతీయ దేశాలతో పోల్చడమేంటని మండిపడ్డారు. ప్రధానికి సీఎం జగన్ రాసిన లేఖలో చైనా, యూరప్‌తో ఏపీని పోల్చడమేంటని ప్రశ్నించారు.
ఆ సంక్షోభానికి ప్రధాన కారణం సీఎం జగనే: పయ్యావుల విద్యుత్ విషయంలో పొరుగున ఉన్న తెలంగాణతో పోల్చుకోకుండా వేరే దేశాలతో పోల్చుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తెలంగాణలో విద్యుత్ వ్యవస్థ మెరుగ్గా ఉండగా.. చైనా గురించి జగన్‌కు ఎందుకని పయ్యావుల విమర్శించారు. విభజన నాటికి ఏపీలో మిగులు ఉంటే.. తెలంగాణలో లోటు ఉందని గుర్తు చేశారు. ప్రస్తుతం విద్యుత్ విషయంలో తెలంగాణ మెరుగ్గా ఉందని తెలిపారు.
వర్షాకాలంలో.. రిజర్వాయర్లు నిండిన సమయంలో కూడా విద్యుత్ కోతలేంటని ప్రశ్నించారు. ఆర్థిక రంగాన్ని సంక్షోభంలోకి నెట్టినట్టే.. విద్యుత్ వ్యవస్థనూ కుదేలు చేశారని మండిపడ్డారు. సీఎంతో అసత్యాలు పలికిస్తూ.. అధికారులు ప్రధానికి లేఖ రాయించారని ఎద్దేవా చేశారు. విద్యుత్ సంస్థల దివాళాకు వైకాపా ప్రభుత్వ విధానాలే కారణమని పయ్యావుల విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకానికి ప్రధానిని బాధ్యుణ్ని చేయవద్దని సూచించారు. ప్రధానికి లేఖ రాసి, బాధ్యత నుంచి తప్పుకోవడం సరికాదన్నారు. ట్రూ అప్ పేరుతో ప్రజలపై రూ.50 వేల కోట్ల అదనపు భారం ఎందుకు మోపుతున్నారని పయ్యావుల మండిపడ్డారు.
ఇదీ చూడండి:VIJAYAWADA KANAKADURGA TEMPLE: నేడు గాయత్రీదేవి రూపంలో దర్శనమివ్వనున్న బెజవాడ దుర్గమ్మ