రాష్ట్రంలోని నగరపాలక సంస్థలు నూతన పాలకవర్గంతో కొలువుదీరాయి. మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారంతో.. కార్పొరేషన్లలో పండుగ వాతావరణం నెలకొంది. ఎక్కడా పోటీ లేకపోవటంతో అన్నిచోట్ల వైకాపా కార్పొరేటర్లకే పదవులు దక్కాయి. మేయర్లు, డిప్యూటీ మేయర్ల పేర్లను ఖరారు చేసిన వైకాపా అధిష్ఠానం సీల్డ్ కవర్లో వాటిని పంపింది. విశాఖ కార్పొరేషన్ మేయర్‌గా గొలగాని హరి వెంకటకుమారి, డిప్యూటీ మేయర్‌గా జియ్యాని శ్రీధర్ ప్రమాణం చేశారు. విజయనగరం మేయర్‌గా వెంపడాపు విజయలక్ష్మితోపాటు.. ఇద్దరు డిప్యూటీ మేయర్లు ముచ్చు నాగలక్ష్మి, కోలగట్ల శ్రావణి ప్రమాణ స్వీకారం చేశారు.
విజయవాడ మేయర్‌గా రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ పేరును.. వైకాపా ఖరారుచేసింది. కోలాహలం మధ్య వీరిద్దరు ప్రమాణస్వీకారం చేశారు. మచిలీపట్నం నగరపాలక సంస్థ తొలి మేయర్‌గా మోకా వెంకటేశ్వరమ్మ పీఠంపై ఆసీనులయ్యారు. డిప్యూటీ మేయర్‌గా టి.కవితను ఎన్నుకున్నారు. గుంటూరు మేయర్‌గా కావటి మనోహర్ నాయుడు.. డిప్యూటీ మేయర్‌గా వనమా బాల వజ్రంబాబు ప్రమాణ స్వీకారం చేశారు.
తిరుపతి మేయర్‌గా శిరీష, డిప్యూటీ మేయర్‌గా ముద్రనారాయణ పేరు ఖరారు కాగా వారిద్దరూ అందరి సమక్షంలో ప్రమాణం చేశారు. తిరుపతి మేయర్ పదవి జనరల్ కేటగిరీలో మహిళలకు కేటాయించినా.. వెనుకబడిన తరగతికి చెందిన మహిళకు అవకాశం ఇచ్చామని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. చిత్తూరులోనూ నూతన పాలకవర్గం... కొలువు దీరింది. మేయర్‌గా అముద, డిప్యూటీ మేయర్‌గా చంద్రశేఖర్ ఎన్నికయ్యారు.