MPs in Parliament: పాలు, పెరుగు, మజ్జిగలాంటి సాధారణ వస్తువులపై 5% జీఎస్‌టీ విధించడం ద్వారా ఎంత పన్ను వస్తుంది? దీని ద్వారా పేదలకు ఏం సందేశం ఇవ్వదలచుకున్నారో ప్రభుత్వం చెప్పాలని తెదేపా ఎంపీ గల్లా జయదేవ్ లోక్‌సభలో డిమాండ్ చేశారు. ‘‘దేశవ్యాప్తంగా ప్రజలు కరోనా మహమ్మారి కారణంగా తీవ్ర ఇబ్బందులుపడ్డారు. ఇప్పడు ఆకాశాన్ని తాకుతున్న ధరలతో సతమతమవుతున్నారు. ప్రస్తుతం సభలో జరుగుతున్న ఈ మథనం వారికి అమృతాన్నివ్వాలని కోరుకుంటున్నాను. ధరల పెరుగుదలకు డీజిల్, పెట్రోల్ ధరలే ప్రధాన కారణం. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కూడా కొంతవరకు దోహదం చేసింది. దీనివల్ల కేవలం సామాన్యుడే కాకుండా చిరువ్యాపారులు, చిన్నచిన్న హోటళ్లు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాయి. ‘గ్యాస్, కూరగాయలు, వంటనూనెలు, పండ్ల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్‌టీ పరిధిలోకి తేవడం ఒక్కటే ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం. ప్రస్తుతం ద్రవ్యోల్బణం 7%కి మించిపోయింది. ఆర్‌బీఐ విధించిన గరిష్ట పరిమితి 6% కంటే ఇది ఎక్కువ. వినియోగదారుల ధరల సూచీ 8.5 %, టోకు ధరల సూచి 16 %కి చేరింది. ద్రవ్యోల్బణం పెరగడమంటే చట్టం లేకుండా పన్నులు వేయడమే. ధరలు అసాధారణ పరిస్థితుల్లో పెరిగినప్పుడు చిల్లర ధరలను నిర్ణయించే అధికారం లీగల్ మెట్రాలజీ నిబంధనల ప్రకారం ప్రభుత్వానికి ఉంది. అందువల్ల ఆర్థికమంత్రి, వినియోగ వ్యవహారాల మంత్రి ఈ దిశలో క్రియాశీలక చర్యలు తీసుకోవాలి. ధరల నియంత్రణ కోసం మార్కెట్‌లో జోక్యం చేసుకోవాలి. ద్రవ్యోల్బణ పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రభుత్వం వద్ద ధరల స్థిరీకరణ నిధి కూడా ఉంది. దానిని ఎంతవరకు ఖర్చుపెట్టిందీ ప్రభుత్వం చెప్పాలి. క్షేత్రస్థాయి వాస్తవాలను దృష్టిలో ఉంచుకొని వెంటనే ఆహార పదార్థాలపై జీఎస్టీ రద్దుచేయాలి’’ అని గల్లా జయదేవ్ డిమాండ్ చేశారు.
కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులు అప్పగించని తెలుగు రాష్ట్రాలు
తెలుగు రాష్ట్రాలు కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)కి అప్పగించాల్సి ఉన్నా ఇంతవరకూ ఆ పని చేయలేదని కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తెలిపారు. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై సోమవారం రాజ్యసభలో తెదేపా సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు ‘2021 జులై 15న కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన కేఆర్‌ఎంబీ జ్యూరిస్‌డిక్షన్ నోటిఫికేషన్ ప్రకారం అందులో పేర్కొన్న షెడ్యూల్-2లోని సాగునీటి ప్రాజెక్టులను ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు తప్పనిసరిగా బోర్డుకు అప్పగించాలి. కానీ రెండు రాష్ట్రాలు ఇప్పటి వరకూ ఆ ప్రాజెక్టుల పరిపాలన, నియంత్రణ, నిర్వహణ, యాజమాన్య బాధ్యతలేమీ అప్పగించలేదు’ అని తెలిపారు. కేఆర్‌ఎంబీ అనుమతి లేకుండా జల విద్యుదుత్పత్తి కోసం తెలంగాణ కృష్ణా నీటిని ఉపయోగించుకుంటోందా? అన్న ప్రశ్నకు బదులిస్తూ ‘జల విద్యుదుత్పత్తికి తెలంగాణ కృష్ణా నీటిని వాడుకొంది. తమ ఉత్తర్వులను అనుసరించాలంటూ కేఆర్‌ఎంబీ తెలంగాణకు 2021 జూన్ 17, జులై 15, 16 తేదీల్లో లేఖలు రాసింది’ అని షెకావత్ చెప్పారు.
దక్షిణ కోస్తా రైల్వేజోన్ కార్యాలయ నిర్మాణానికి భూమి గుర్తించాం: మంత్రి అశ్వినీ వైష్ణవ్
ఈనాడు, దిల్లీ: విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్ కార్యాలయ సముదాయ నిర్మాణానికి భూమిని గుర్తించినట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఆయన రాజ్యసభలో తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. ‘కొత్త రైల్వేజోన్, రాయగడ డివిజన్ ఏర్పాటు పనులకు రూ.170 కోట్లు ఖర్చవుతుందని అంచనావేసి 2020-21 రైల్వే బడ్జెట్‌లో చేర్చాం. 2021-22, 2022-23 బడ్జెట్‌లలో ఒక్కో పనికోసం రూ.40 లక్షల చొప్పున కేటాయించాం. కొత్త జోన్ ఏర్పాటుకు సంబంధించిన డీపీఆర్‌ను ఓఎస్‌డీ రైల్వేశాఖకు సమర్పించారు. ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి సర్వే, ఆఫీసు, నివాస సముదాయాలు, ఇతర భవన నిర్మాణాలకు అవసరమైన పూర్తిస్థాయి లేఅవుట్‌లాంటి ముందస్తు పనులను పూర్తి చేయమని చెప్పాం’ అని వెల్లడించారు.
చింతలపూడి బొగ్గు గనికి ఒక్క బిడ్డూ రాలేదు:ఆంధ్రప్రదేశ్‌లోని చింతలపూడి సెక్టార్-ఏ1 బొగ్గు గనిని వేలానికి ఉంచితే ఒక్క బిడ్డూ రాలేదని కేంద్ర బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. రాజ్యసభలో వైకాపా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో ఉన్న చింతలపూడి సెక్టార్-ఏ1లో 867 మిలియన్ టన్నులు, సోమవరం ఈస్ట్‌లో 103 మి.టన్నులు, సోమవరం వెస్ట్‌లో 97 మి.టన్నుల బొగ్గు ఉన్నట్లు అంచనా వేశామన్నారు. చింతలపూడి గనిని వేలానికి ఉంచగా ఒక్క బిడ్డూ రాలేదని వెల్లడించారు.
కులగణన తప్పనిసరిగా చేపట్టాలి: ఎంపీ రామ్మోహన్‌నాయుడు
కేంద్రం చేపట్టబోయే జనగణన సమయంలో తప్పనిసరిగా కులగణన చేపట్టాలని తెదేపా ఎంపీ కె.రామ్మోహన్‌నాయుడు డిమాండ్ చేశారు. ఆయన సోమవారం రూల్ 377కింద ఈ అంశాన్ని సభ ముందుంచారు. ‘ప్రస్తుతం భారత జనాభా 138 కోట్లకు చేరింది. అయితే ప్రభుత్వం మాత్రం జనాభా 27 కోట్లుగా ఉన్న 1931 లెక్కలనే ఇప్పటికీ బీసీల కోసం ఉపయోగిస్తోంది. లోపభూయిష్టమైన ఆ గణాంకాల ఆధారంగా రూపొందిస్తున్న విధానాలవల్ల వెనకబడిన తరగతులకు సరైన అవకాశాలు లభించడం లేదు. దీంతోపాటు కేంద్రం బీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేయాలి. దీంతో ఓబీసీల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వపరంగా ప్రత్యేక దృష్టి సారించడానికి వీలవుతుంది’ అని రామ్మోహన్‌నాయుడు పేర్కొన్నారు.