తమిళనాడును స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్రంలో రహదారి ప్రమాదాల తగ్గింపునకు కృషి చేస్తామని ఆంధ్రప్రదేశ్ రవాణాశాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. జాతీయ రహదారి భద్రత అంశంపై కేంద్ర రహదారి రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షతన దిల్లీలో మంగళవారం జరిగిన సమావేశంలో మంత్రి పేర్ని పాల్గొన్నారు. తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను (బ్లాక్ స్పాట్స్)ను గుర్తించి అక్కడ వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పారన్నారు. రాష్ట్ర రహదారులపైనా బ్లాక్ స్పాట్స్‌ను గుర్తించి నివారణ చర్యలు చేపడితే సగం ఖర్చు తాము భరిస్తామని కేంద్రమంత్రి తెలిపారని నాని చెప్పారు.
రోడ్డు ప్రమాద బాధితుల కోసం కేంద్రం తీసుకువచ్చిన నగదు రహిత చికిత్స పథకాన్ని స్వాగతిస్తున్నామని చెప్పిన మంత్రి దానిని వైఎస్సార్ ఆరోగ్యశ్రీతో అనుసంధానం చేయాలని కేంద్రాన్ని కోరనున్నట్లు తెలిపారు. రాష్ట్ర రవాణా శాఖ కార్యకలాపాలను కేంద్ర ప్రభుత్వ వాహన సారథి సాఫ్ట్‌వేర్‌తో నిర్వహించేందుకు కేంద్ర రవాణా శాఖ సహాయం తీసుకుంటామని పేర్ని తెలిపారు. వాహనాల తనిఖీ, పరీక్ష, ధ్రువీకరణ కేంద్రాన్ని విశాఖపట్నానికి మంజూరు చేసినందుకు గడ్కరీకి కృతజ్ఞతలు తెలిపినట్లు చెప్పారు.