15 వ ఆర్థికసంఘం సిఫార్సులు రాష్ట్రానికి తీవ్ర నష్టం కలిగించాయి. కేంద్ర పన్నుల్లో ఏపీ వాటా 4.30 శాతం నుంచి 4.11 శాతానికి తగ్గించడం వల్ల వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం దాదాపు 15వందల కోట్లకు పైగా నష్టపోనుంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర పన్నుల్లో రాష్ట్రానికి 28, 242 కోట్లు రాగా...2020-21కి 32వేల 237 కోట్లకు పెరగనుంది. గతేడాదితో పోలిస్తే నికరంగా 4వేల కోట్లకు పైగా పెరిగింది. కానీ రాష్ట్రాల వాటాలను లెక్కించడానికి 15 వ ఆర్థికసంఘం తీసుకున్న కొలమానాల కారణంగా ఏపీకి 15 వందల 21 కోట్ల రూపాయలు నష్టపోవాల్సి వస్తుంది.
రెవెన్యూలోటు కింద రాష్ట్రానికి ఈ ఆర్థిక ఏడాది 5వేల 897 కోట్లు ఇవ్వాల్సిందింగా 15వ ఆర్థికసంఘం సిఫార్సు చేసింది. రాష్ట్రానికి ఈ ఏడాది 41వేల 54 కోట్ల రూపాయల రెవెన్యూలోటు ఏర్పడుతుందని అంచనా వేయగా....కేంద్ర పన్నుల్లో వాటా కింద 35వేల 156 కోట్లు పోను మిగిలిన 5వేల 897 కోట్లు లోటు ఉంటుందన్న ఉద్దేశంతోనే ఈ సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. 14వ ఆర్థికసంఘం సిఫార్సు మేరకు గత ఐదేళ్లలో రెవెన్యూలోటు కింద 22వేల 133 కోట్లు అందాయి. 2019-20 నాటికి రెవెన్యూలోటు 2వేల 499 కోట్లకే పరిమితమవుతుందని ఆ సంఘం అంచనా వేసింది. 2020-21 నాటికి మరింత తగ్గాల్సి ఉన్నా....ఏకంగా 5వేల 897 కోట్లకు చేరడం విశేషం. 14, 15 ఆర్థిక సంఘాల అంచనాల్లో గందరగోళం చూస్తుంటే...గడిచిన ఐదేళ్లలో రాష్ట్రానికి మరిన్ని నిధులు రావాల్సి ఉన్నట్లు తెలుస్తోంది.