రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు ప్రబలిస్తున్న వేళ అధికారులు... అప్రమత్తమయ్యారు. వైరస్ నివారణ కోసం యత్నిస్తున్నారు.కడప జిల్లా పులివెందులలో రాష్ట్ర అడిషనల్ డీజీ శ్రీధర్‌బాబు పర్యటించారు.స్థానికంగా ఉన్న పరిస్థితులపై ఆరా తీశారు. పోలీసులు, విలేకరులకు ఆయున శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేశారు. కర్నూలు జిల్లా నంద్యాలలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. 48 గంటల పాటు నిత్యాసవసర వస్తువుల సరఫరా నిలిపివేశారు. ఇంటి నుంచి ఎవరూ బయటకు రావద్దని ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని పరిస్థితిపై ఎమ్మెల్యే అధికారులతో సమీక్షించారు. కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా శ్రీశైల దేవస్థానం లాక్‌డౌన్ పటిష్టంగా అమలు చేస్తోంది. శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల దర్శనాలు పూర్తిగా నిలిచిపోయాయి. దేవస్థానం అన్నప్రసాద విభాగంలో నిత్యం 600 మందికి సరిపడా ఆహారాన్ని తయారు చేసి...ప్రత్యేక వాహనం ద్వారా పంపిణీ చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా తునిలో లాక్‌డౌన్ అమలవుతున్న తీరును ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా పరిశీలించారు. పట్టణంలో ద్విచక్రవాహనంపై తిరుగుతూ.. ప్రజలంతా సహకరించాలని కోరారు.
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ఉద్యోగుల సేవలు అభినందనీయమని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అన్నారు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వర్తిసున్నారంటూ కొనియాడారు. వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది, రెవెన్యూ, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్ల సేవలకు కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. మరో మూడు వారాల పాటు ఇదే పద్ధతిలో పనిచేస్తే కరోనా మహమ్మారిపై విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ద్విచక్రవాహనంపై ఒకరు... కారులో ఇద్దరికి మించి ఎక్కితే సంబంధితులపై విజయవాడ నగర పోలీసులు.. వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదుచేస్తున్నారు. నిబంధనలు అతిక్రమించి తెరచిన 352 దుకాణాలు, 535 దుకాణదారులపై కేసులు నమోదు చేశారు. 172 వాహనాలను సీజ్ చేశారు . ముఖ్యమైన పనులుంటే తప్ప... మిగిలినవారు వాహనాలతో బయటకు రావద్దని చెబుతున్నారు. ప్రజలంతా లాక్‌డౌన్‌కు సహకరించాలని విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు.