శాసనమండలికి నూతన ఛైర్మన్ ఎన్నిక మరికొంత కాలం ఆలస్యం కానుంది. ప్రస్తుత ఛైర్మన్ ఎంఏ షరీఫ్ పదవీకాలం ఈ నెలలోను, డిప్యూటీ ఛైర్మన్ రెడ్డి సుబ్రమణ్యం పదవీకాలం వచ్చే నెల 18తోను ముగుస్తున్నాయి. దీంతో ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్లను కొత్తగా ఎన్నుకోవాలి. జూన్ 18 తర్వాత వెంటనే ఈ ఎన్నిక నిర్వహించి ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్లను ఎన్నుకోవాలని భావించినట్లు వైకాపా వర్గాలు తెలిపాయి. అప్పటికి మండలిలో వైకాపా సంఖ్యాబలం పెరుగుతుందని అలా భావించారు.
మండలిలో ఈ నెల 24తో ఎమ్మెల్యేల కోటాలో ఖాళీ అయ్యే మూడు స్థానాలకు తిరిగి ఎన్నికలు నిర్వహించాలి. అయితే కొవిడ్ నేపథ్యంలో ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ప్రకటించింది. పరిస్థితులు కుదుటపడ్డాక ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. మరోవైపు వచ్చే నెల 18తో శాసనమండలిలో స్థానిక సంస్థల కోటాలో 10 స్థానాలు ఖాళీ అవుతాయి. రాష్ట్రంలో జిల్లా, మండల పరిషత్ ఎన్నికల ఫలితాలపై ఇంకా స్పష్టత రాలేదు.
ఈ అంశం కోర్టులో ఉన్నందువల్ల ఆ ఖాళీలకూ ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. జూన్ 11న గవర్నర్ కోటాలోని మరో నాలుగు ఎమ్మెల్సీ స్థానాలూ ఖాళీ కానున్నాయి. మొత్తమ్మీద జూన్ 18 నాటికి సుమారు 17 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతాయి. గవర్నర్ కోటా వరకూ నేరుగా ఆయనే నియమిస్తారు. కానీ ఎమ్మెల్యే, స్థానిక సంస్థల కోటాలో ఖాళీ అయ్యే 13 స్థానాలు ఇప్పట్లో భర్తీ కావు. వీటిలో కొత్త ఎమ్మెల్సీలు వస్తేనే వైకాపా బలం మండలిలో పెరుగుతుంది.