అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదాల మధ్య ద్రవ్య వినిమయ బిల్లు ప్రవేశపెట్టకుండానే శాసనమండలి నిరవధిక వాయిదా పడింది. మండలి ముందుకు వచ్చిన బిల్లుల్లో ద్రవ్యబిల్లునే ముందుగా ప్రవేశపెట్టాలని తెలుగుదేశం డిమాండ్ చేయగా.. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల్ని తీసుకోవాలని వైకాపా పట్టుబట్టింది. రూల్ 90 కింద యనమల రామకృష్ణుడు ఇచ్చిన నోటీసుపైనా విస్తృతచర్చ జరిగింది. తీర్మానంపై ఓటింగ్ చేపట్టాలని తెలుగుదేశం సభ్యులు భీష్మించారు. ఇరుపక్షాల సభ్యులూ పోడియం ముందుకు దూసుకురావడం వల్ల మండలిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మండలి ముందుకు 13 బిల్లులు రాగా.. వాటిలో ఎనిమిదింటిని చర్చించి ఆమోదించారు.
సభ్యుల వాగ్వాదం
ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టాలని డిప్యూటీ ఛైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం సూచించగా.. ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి సిద్ధమయ్యారు. కానీ.. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను ప్రవేశపెట్టాలని మంత్రి బొత్స సత్యనారాయణ కోరారు. ఇందుకు ప్రతిపక్షం అంగీకరించలేదు. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులను చర్చకు తీసుకోవాలని మంత్రి బుగ్గన కోరారు. రూల్ 90 కింద తీర్మానం కోసం తానిచ్చిన నోటీసును పరిగణనలోకి తీసుకోవాలని యనమల కోరారు. ఈ నేపథ్యంలో యనమల, పిల్లి సుభాష్‌చంద్రబోస్ మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. రూల్ 90 కింద తాము ఇచ్చిన తీర్మానాన్ని ఆమోదించడంపై ఓటింగ్‌కు తెదేపా సభ్యులు డిమాండ్ చేశారు. ఘర్షణ వాతావరణం నెలకొనడంతో సభను డిప్యూటీ ఛైర్మన్ నిరవధికంగా వాయిదా వేశారు.