ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మండలిలో అడ్డుకున్న బిల్లులెన్ని.. వాస్తవలేంటి..?

'శాసనసభ ఆమోదించిన బిల్లులను మండలిలో ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయి.. ఇలాంటి పరిణామాలు మంచివి కావు. రాష్ట్రాభివృద్ధికి అడ్డంకిగా మారుతున్న మండలిని రద్దు చేస్తే ఈ పరిస్థితిని అధిగమించవచ్చు' ఇదీ రాష్ట్ర ప్రభుత్వ వాదన. ఇదే అంశాన్ని పరిగణలోకి తీసుకుంటే... వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మండలిలో ఎన్ని బిల్లులకు బ్రేక్ పడింది? ఎన్ని బిల్లులకు సవరణలు కోరింది.. రాష్ట్ర ప్రభుత్వం చేస్తోన్న వాదనల్లో నిజమెంత..? అన్న అంశాలపై ప్రత్యేక కథనం..!

ap-legislative-council-approved-36-bills-out-off-40
ap-legislative-council-approved-36-bills-out-off-40

By

Published : Jan 28, 2020, 12:35 PM IST

మండలిలో అడ్డుకున్న బిల్లులపై వాస్తవ పరిస్థితి
రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ సందర్భాల్లో తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర శాసనసభతో పాటు మండలి సంయుక్తంగానే ఆమోదాన్ని తెలియజేశాయి. కేబినెట్ ఆమోదించిన వివిధ బిల్లులకు ఈ రెండు సభలూ చట్ట రూపాన్ని తీసుకువచ్చాయి. మొత్తం 3 సార్లు జరిగిన విధాన పరిషత్ సమావేశాల్లో మొత్తం 40 బిల్లులకు 36 బిల్లులు ఉభయ సభల్లోనూ ఆమోదం పొందాయి.

40 బిల్లులకు 36 బిల్లులు యథాతథంగా

మండలి రద్దయితే అత్యున్నత స్థాయిలో చర్చ జరిపే సవరణలు, చిన్న చిన్న పొరపాట్లను సవరించుకునే అవకాశం లేకుండా పోతుంది. గడచిన ఏడు నెలల్లో మూడు సెషన్లను విధాన పరిషత్ నిర్వహించింది. ఈ మూడు సమావేశాల్లోనూ మొత్తం 40 బిల్లులు ప్రవేశపెడితే... 36 బిల్లులు యథాతథంగా.. మరో రెండు బిల్లులను సవరణలతో మండలి ఆమోదించింది.

ఆ రెండు బిల్లుల సెలక్ట్ కమిటీకి

ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు కమిషన్లు ఏర్పాటు చేసే బిల్లులపై మండలిలో సవరణలు ప్రతిపాదించారు. అటు ఆంగ్లమాధ్యమం అమలు బిల్లుపై కూడా సవరణలు చేస్తూ సూచనలు చేసింది. అయితే ఈ సవరణలను పరిగణనలోకి తీసుకోని శాసనసభ యథాతథంగానే బిల్లులను ఆమోదించింది. ఇక పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం ఉపసంహరణ బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపుతూ పెద్దల సభ నిర్ణయం తీసుకుంది.

కీలక బిల్లులకు ఆమోదం

అంతకుముందు జూలై 17న నిర్వహించిన విధాన పరిషత్ సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశ పెట్టిన విద్యుత్ నిబంధనల చట్ట సవరణ, బీసీ, ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలకు, మహిళలకు నామినేటెడ్ పోస్టులు, ప్రభుత్వ కాంట్రాక్టుల్లో 50 శాతం రిజర్వేషన్, పరిశ్రమల్లో స్థానిక యువతకు రిజర్వేషన్లు, మద్యం విధానం సవరణకు సంబంధించి, అలాగే సాగుదారుల హక్కుల చట్టం, ప్రభుత్వ టెండర్లలో జ్యుడీషియల్ ప్రివ్యూ చట్టం, పాఠశాల, ఉన్నత విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ల ఏర్పాటుకు సంబంధించిన చట్టాలను ఉభయ సభలూ యథాతథంగానే ఆమోదాన్ని తెలిపాయి. ఏపీ దిశ చట్టం, ఆర్టీసీ విలీనానికి సంబంధించిన బిల్లును కూడా శాసన మండలి అలాగే ఆమోదాన్ని తెలిపింది.

కేవలం రెండు బిల్లుల వల్లేనా..?

కేవలం రెండు బిల్లుల విషయంలో ప్రజాభిప్రాయ సేకరణ కోసం సెలక్ట్ కమిటీకి పంపిన కారణంతో మండలి రద్దుపై ఊహాగానాలు తెరమీదకు వచ్చాయి. అంతే వేగంతో మండలి రద్దుకు కేబినెట్ ఆమోదం, శాసనన సభ తీర్మానం ఒకదాని తర్వాత ఒకటి చకచకా జరిగిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం చేసిన తీర్మానంపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే విషయంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

ఇదీ చదవండి:

శాసనమండలిపై నాడు రాజశేఖర్​రెడ్డి - నేడు జగన్ ఏమన్నారంటే?

ABOUT THE AUTHOR

...view details