ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

లీటరుకు 30 మి.లీ తక్కువ పోసేస్తున్నారు - తూనికల కొలతల శాఖ దాడులు

పెట్రోల్​ బంకులపై తూనికల కొలతల శాఖ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజులుగా 25 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. లీటర్‌కు 30 నుంచి 40 మిల్లీ లీటర్ల తక్కువ పెట్రోల్‌ను వినియోగదారునికి పోస్తున్న విషయాన్ని గుర్తించామని అధికారులు వెల్లడించారు. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.

ap legal metrology
ap legal metrology

By

Published : Sep 6, 2020, 3:54 AM IST

Updated : Sep 6, 2020, 6:15 AM IST

పెట్రోల్ బంకుల్లో జరుగుతున్న అవకతవకలపై తూనికలు కొలతలశాఖ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రెండో రోజు 25 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. చిప్‌ ఉపయోగించి... లీటర్‌కు 30 నుంచి 40 మిల్లీ లీటర్ల తక్కువ పెట్రోల్‌ను వినియోగదారునికి పోస్తున్న విషయాన్ని గుర్తించామని తూనికలు కొలతలశాఖ ఐజీ కాంతారావు తెలిపారు. పలు జిల్లాల్లో ఈ విధంగా మోసం చేస్తున్న విషయం వెల్లడైందన్నారు. మరిన్ని చోట్ల దాడులు చేసి.. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

* చిప్‌ల ద్వారా పెట్రోలుపై లీటరుకు రూ.2.60పైనే కొల్లగొడుతున్నారు. సగటున రోజుకు 5 వేల లీటర్ల పెట్రోలు (లీటరు ధర రూ. 87.05 అయితే 30 మి.లీకు రూ. 2.61) అమ్మకం జరిగే బంకుల్లో రూ.13వేలకు పైగా అక్రమాలకు పాల్పడుతున్నారు. రోజుకు 15 వేల లీటర్ల డీజిల్‌ (లీటరు ధర రూ. 80.19. అయితే 30 మి.లీకు రూ. 2.40) అమ్మకం జరిగే బంకులో రూ.36 వేల వరకు దోచుకుంటున్నారు. మొత్తంగా ఒక్కో బంకులో రోజుకు దాదాపుగా రూ.50వేల వరకు దోపిడీ సాగుతున్నట్లు అర్థమవుతోంది. రోజుకు 1,200 లీటర్ల పెట్రోలు విక్రయించే బంకుల్లోనూ వీటిని ఏర్పాటు చేసినట్లు తనిఖీల్లో వెల్లడైంది.

డిస్‌ప్లే, కీప్యాడ్‌ల ద్వారా
* పెట్రోలుపంపుల్లో మదర్‌బోర్డు, పల్సర్‌, డిస్‌ప్లే, కీబోర్డు తదితర వ్యవస్థలు పనిచేస్తుంటాయి. మదర్‌బోర్డు, పల్సర్‌కు తూనికలు, కొలతలశాఖ అధికారులు సీలు వేస్తారు. రోజువారీ ధరల సవరణ నేపథ్యంలో మిగిలినవాటికి సీల్‌ వేయడంలేదు.
* మదర్‌బోర్డు, పల్సర్‌ను తాకే అవకాశం లేకపోవడంతో కొలతలు తగ్గించేందుకు కొత్త ప్రోగ్రామ్‌తో చిప్‌లు తయారుచేశారు. వీటిని డిస్‌ప్లే, కీబోర్డులకు అనుసంధానించి వినియోగిస్తున్నారు.
* మదర్‌బోర్డును అనుసంధానించేలా కాలిబ్రేషన్‌ కార్డు ఉంటుంది. అక్రమాలకు దీన్ని సాధనంగా ఎంచుకున్నారు. కాలిబ్రేషన్‌ కార్డు స్థానంలో ప్రోగ్రామింగ్‌ చేసిన చిప్‌ ఆధారిత పరికరాన్ని పెడుతున్నారు.
* పంపు తెరచి చూసినా మదర్‌బోర్డులో ఎలాంటి తేడా కన్పించదు. బోర్డుల వెనకవైపున చిప్‌లను అమరుస్తున్నారు.

ట్యాంపరింగ్‌కు తావు లేకుండా
ప్రస్తుతం వినియోగించే కొన్ని మోడల్స్‌లో ఎలాంటి మార్పు చేయడానికి వీలుండదు. సరిచేయాలని ప్రయత్నించినా పంపు పనిచేయడమే నిలిచిపోతుంది. తాజా పరిణామాల నేపథ్యంలో అన్ని బంకుల్లోనూ ఇలాంటి వాటిని వినియోగించేలా తూనికలు, కొలతలశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఆటోమేషన్‌ ద్వారా ధరల సవరణ, ఇతర ప్రక్రియలు చేసే విధానాన్ని సూచిస్తున్నారు. ఇది కేంద్రప్రభుత్వ స్థాయిలో చేయాల్సిన పని కావడంతో అక్కడి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నట్లు అధికారులు వివరించారు.

ఇదీ చదవండి

కోడి కత్తి కేసు: హైకోర్టును ఆశ్రయించిన నిందితుడు శ్రీనివాసరావు

Last Updated : Sep 6, 2020, 6:15 AM IST

ABOUT THE AUTHOR

...view details