ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

High Court: న్యాయాధికారి కాని వ్యక్తి న్యాయశాఖ కార్యదర్శా..?: హైకోర్టు - Law Secretary issue on hc

High Court: న్యాయాధికారి కాని వారిని న్యాయశాఖ కార్యదర్శిగా ఎలా నియమిస్తారంటూ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా ఈ విధంగా వ్యవహరించారా అంటూ ఏజీ శ్రీరామ్‌ను సూటిగా ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై పరిశీలన చేసి కోర్టుకు అవగాహన కల్పించాలని కోరింది.

HC On Law Secretary
HC On Law Secretary

By

Published : Mar 25, 2022, 5:06 AM IST

Updated : Mar 25, 2022, 6:24 AM IST

HC on Law Secretary issue: న్యాయశాఖ కార్యదర్శి నియామకంపై రాష్ట్ర ప్రభుత్వ తీరును హైకోర్టు తప్పుపట్టింది. న్యాయాధికారి (జ్యుడీషియల్‌ ఆఫీసర్‌) కాని వ్యక్తి రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శిగా పని చేస్తుండటంపై విస్మయం వ్యక్తం చేసింది. ఇలాంటి నియామకం దేశంలో ఏ రాష్ట్రంలోనైనా జరిగిందా అని అడ్వకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరామ్‌ను ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై పరిశీలన జరిపి కోర్టుకు అవగాహన కల్పించాలని కోరింది. న్యాయశాఖ కార్యదర్శి నియామకానికి అర్హతలేమిటి? రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధి విధానాలేమిటి? చెప్పాలంది. శ్రీకాళహస్తిలో కొత్తగా ఏర్పాటు చేసిన కోర్టులో సిబ్బందికి తాజా పీఆర్సీ ప్రకారం జీతభత్యాలు నిర్ణయించే వ్యవహారంపై ఉత్తర్వులిచ్చేందుకు గడువు కావాలని ఏజీ కోరడంతో విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం గురువారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.

శ్రీకాళహస్తిలో అదనపు జిల్లా కోర్టు ఏర్పాటులో జాప్యం, సిబ్బంది కేటాయింపులో అలసత్వాన్ని సవాలు చేస్తూ ఎం.ప్రసాద్‌ హైకోర్టులో వ్యాజ్యం వేశారు. ఇటీవల ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన కోర్టు.. న్యాయశాఖ కార్యదర్శి హాజరుకు ఆదేశించింది. గురువారం విచారణకు న్యాయశాఖ కార్యదర్శి వి.సునీత (ఎఫ్‌ఏసీ) హాజరయ్యారు. ఏజీ వాదనలు వినిపిస్తూ.. కోర్టుకు సిబ్బందిని శాశ్వత పద్ధతిలో నియమించాలా, ఒప్పంద విధానంలోనా అనే స్పష్టత కోసం న్యాయశాఖ కార్యదర్శి హైకోర్టుకు లేఖ రాశారని తెలిపారు. వాస్తవానికి ఆ లేఖ అవసరం లేదని, 2015లో పీఆర్సీ ప్రకారం కొత్త కోర్టులో సిబ్బంది నియామకానికి ప్రభుత్వం జీవో ఇచ్చిందని వివరించారు. తాజా పీఆర్సీ ప్రకారం ఉత్తర్వులివ్వాల్సి ఉందని పేర్కొన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. కోర్టులో శాశ్వత ఉద్యోగుల విషయంలో పే స్కేల్‌ అమలు చేయాలని పేర్కొంది. ఈ వ్యవహారంపై దృష్టి పెడతానని ఏజీ చెప్పడంతో విచారణను వాయిదా వేసింది.

Last Updated : Mar 25, 2022, 6:24 AM IST

ABOUT THE AUTHOR

...view details