Narcotics Control Bureau: ఆంధ్రప్రదేశ్‌లో దొరికినంత గంజాయి మరే రాష్ట్రంలోనూ స్వాధీనం చేసుకోలేదని.. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) నివేదిక-2021 పేర్కొంది. ఈ విషయంలో రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచినట్లు వెల్లడించింది. 2021లో స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాలపై ఎన్‌సీబీ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. దేశవ్యాప్తంగా 7,49,761 కిలోల గంజాయి దొరికింది. ఇందులో 2,00,588కిలోలను (26.75%) ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే గుర్తించారు. ఆ తర్వాతి స్థానంలో పొరుగు రాష్ట్రం ఒడిశా (1,71,713 కిలోలు) ఉంది. దేశంలో స్వాధీనం చేసుకున్న మొత్తం గంజాయిలో 50% ఈ రెండు రాష్ట్రాల్లోనిదే.
ఎక్కువ సరకు దొరికింది మన రాష్ట్రంలోనే:ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో హషీష్ 18.14 కిలోలు, హషీష్ ఆయిల్ 6.13 లీటర్లు, 3 ఎల్‌ఎస్‌డీ బ్లాట్స్ స్వాధీనం చేసుకున్నారు. మాదకద్రవ్యాలకు సంబంధించిన వ్యవహారంలో రాష్ట్రంలో 1,775 కేసులు నమోదుచేసి, 4,202 మందిని అరెస్టు చేశారు. తెలంగాణలో 35,270 కిలోల గంజాయి, 0.03 కిలోల హషీష్, 18.5 లీటర్ల హషీష్ ఆయిల్, 0.03 కిలో హెరాయిన్, 0.01 కిలోల కెటామైన్, 31 ఎల్‌ఎస్‌డీ బ్లాట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.