ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

హామీల 'ఎత్తిపోత'.. జీడిపల్లి ఎగువ పెన్నా పథకంపై నీలినీడలు! - ఎత్తిపోతల పథకాలు

జీడిపల్లి-ఎగువ పెన్నా (పేరూరు) ఎత్తిపోతల పథకంలో భాగంగా చేపట్టిన జలాశయాల నిర్మాణంపై ముఖ్యమంత్రి, స్థానిక ఎమ్మెల్యే ఇచ్చిన హామీలు శిలాఫలకాలకే పరిమితమయ్యాయి. తమది చేతల ప్రభుత్వమని, చెప్తే చేసి తీరుతామని, రెండేళ్లలో పనులను పూర్తి చేస్తామని 2020 డిసెంబరు 9న నిర్వహించిన బహిరంగ సభలో అనంతపురం జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి హోదాలో బొత్స సత్యనారాయణ సైతం భరోసా ఇచ్చారు. ఇప్పటికి ఏడాదిన్నర కావస్తున్నా ఒక్క అడుగూ పడలేదు.

AP Irrigation project
జీడిపల్లి ఎగువ పెన్నా పథకం

By

Published : Jun 23, 2022, 5:46 AM IST

జీడిపల్లి జలాశయం నుంచి ఎగువ పెన్నా ప్రాజెక్టును అనుసంధానం చేసి అనంత పురం జిల్లాలోని 8 మండలాల పరిధిలోని 75 వేల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. ఇందుకు రూ.803 కోట్ల ఖర్చుతో ముట్టాల, తోపుదుర్తి, దేవరకొండ, సోమరవాండ్లపల్లి వద్ద నాలుగు జలాశయాలను నిర్మిస్తాం. నాలుగు ఎత్తిపోతల పథకాలను చేపడతాం. తెదేపా హయాంలో ఒక్క ప్రాజెక్టుకు అయ్యే ఖర్చుతో ఇప్పుడు ఏకంగా మూడు ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం. జీడిపల్లి నుంచి ఎగువ పెన్నా వరకు 53.45 కిలోమీటర్ల ప్రధాన కాలువ, 110 కాంక్రీటు కట్టడాలను నిర్మిస్తాం.2020 డిసెంబరు 9న చెన్నేకొత్తపల్లి మండలం వెంకటాంపల్లి వద్ద జలాశయానికి వర్చువల్‌గా శంకుస్థాపన చేసిన సందర్భంగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యలు

జీడిపల్లి-ఎగువ పెన్నా (పేరూరు) ఎత్తిపోతల పథకంలో భాగంగా చేపట్టిన జలాశయాల నిర్మాణంపై ముఖ్యమంత్రి, స్థానిక ఎమ్మెల్యే ఇచ్చిన హామీలు శిలాఫలకాలకే పరిమితమయ్యాయి. తమది చేతల ప్రభుత్వమని, చెప్తే చేసి తీరుతామని, రెండేళ్లలో పనులను పూర్తి చేస్తామని 2020 డిసెంబరు 9న నిర్వహించిన బహిరంగ సభలో అనంతపురం జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి హోదాలో బొత్స సత్యనారాయణ సైతం భరోసా ఇచ్చారు. ఇప్పటికి ఏడాదిన్నర కావస్తున్నా ఒక్క అడుగూ పడలేదు. అయితే... ఈనెల 14న చెన్నేకొత్తపల్లికి వచ్చిన సీఎం జగన్‌ పథకాన్ని మరో రెండేళ్లలో పూర్తిచేస్తామని ప్రకటించడం గమనార్హం.

.

75 వేల ఎకరాలకు సాగునీరు
అనంతపురం జిల్లా జీడిపల్లి జలాశయం నుంచి 7.2 టీఎంసీల కృష్ణా జలాలను సత్యసాయి జిల్లా పేరూరులోని ఎగువపెన్నా ప్రాజెక్టుకు తరలించడానికి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా దేవరకొండ, ముట్టాల, తోపుదుర్తి, సోమరవాండ్లపల్లి వద్ద నూతన జలాశయాలను నిర్మించేలా ప్రణాళికలు రూపొందించారు. వీటిలోకి నీటిని తరలించడానికి కొత్తపల్లి, ఆత్మకూరు, బాలవెంకటాపురం, మద్దెలచెరువు వద్ద ఎత్తిపోతల పథకాలను నిర్మించాల్సి ఉంది. ఎగువ పెన్నాతోపాటు కొత్త జలాశయాలను కృష్ణా జలాలతో నింపి శ్రీసత్యసాయి జిల్లాలోని కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి, రామగిరి, అనంతపురం జిల్లాలోని రాప్తాడు, ఆత్మకూరు, కంబదూరు, కూడేరు, బెళుగుప్ప మండలాల పరిధిలో 75 వేల ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకు 5,171 ఎకరాలు సేకరించాల్సి ఉంది. ఇప్పటివరకు ఒక్క అడుగైనా పడలేదు. ఒక్క రూపాయి ఖర్చు చేయలేదు.

రూపు మార్చి కొత్త పథకం
జీడిపల్లి-ఎగువ పెన్నా ఎత్తిపోతలకు తెదేపా హయాంలోనే శ్రీకారం చుట్టారు. 2018 ఆగస్టులో అప్పటి సీఎం చంద్రబాబు భూమిపూజ చేశారు. జీడిపల్లి నుంచి ఎగువపెన్నాకు కృష్ణా జలాలను తేవాలంటే 94.3 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోయాల్సి ఉంటుంది. ఇందుకు నాలుగు ప్రాంతాల్లో ఎత్తిపోతల పథకాలను, పుట్టకనుమ, సోమరవాండ్లపల్లి వద్ద బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్లను నిర్మించాలని నిర్ణయించారు. రూ.803 కోట్లకు పరిపాలన అనుమతులిచ్చి, రూ.565 కోట్లకు టెండర్లు పిలిచారు. జీడిపల్లి నుంచి ఎగువ పెన్నా వరకు పంపుహౌస్‌లు, కల్వర్టులు, చిన్న వంతెనలు మినహా 53.45 కి.మీ. ప్రధాన కాలువ నిర్మాణాన్ని పూర్తిచేశారు. వైకాపా అధికారంలోకి వచ్చాక పథకం ఆకృతులను మార్చేసింది. పుట్టకనుమ జలాశయాన్ని రద్దు చేసి అదనంగా దేవరకొండ, ముట్టాల, తోపుదుర్తి జలాశయాలను చేర్చింది.

.

పరిహారం పెంచాలంటున్న రైతులు
పరిహారం తక్కువగా ఉందనే కారణంతో రైతులు తమ భూములను ఇవ్వడానికి అంగీకరించడం లేదు. ప్రభుత్వ ధర ప్రకారం ఎకరాకు రూ.4 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు వచ్చే అవకాశముందని అధికారులు చెబుతున్నారని, కనీసం రూ.20 లక్షలు ఇవ్వాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. ముంపు గ్రామాల బాధితులతో అధికారులు పలుమార్లు చర్చించినా ఫలితం తేలలేదు. సీఎం తాజా ప్రకటన మేరకైనా పనులను చేపట్టాలని రైతులు కోరుతున్నారు.

ఇదీ చూడండి:సీఎం జగన్ పారిస్‌ పర్యటనకు.. సీబీఐ కోర్టు పచ్చజెండా

హిందూపురం వైకాపాలో మరోసారి భగ్గుమన్న వర్గ పోరు

ABOUT THE AUTHOR

...view details