కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) డైరెక్టర్‌గా ఎంపిక కోసం తయారుచేసిన ముగ్గురు సీనియర్ అధికారుల తుది జాబితాలో ఏపీ కేడర్ ఐపీఎస్ అధికారి వీఎస్‌కే కౌముదికి చోటు లభించింది. ఆదివారం రాత్రి ప్రధానమంత్రి నివాసంలో ప్రధాని నరేంద్ర మోదీ, భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ, లోక్‌సభలో ప్రతిపక్షనేత అధీర్ రంజన్ చౌధరిల కమిటీ సమావేశమై 1984-87 మధ్య కాలానికి చెందిన వంద మంది అధికారుల పేర్లపై చర్చించి చివరకు ముగ్గురు సీనియర్ల పేర్లను తుది పరిశీలనకు ఎంపిక చేసినట్లు తెలిసింది. నాలుగు నెలల విరామం అనంతరం జరిగిన ఈ సమావేశంలో సుమారు గంటన్నరపాటు వివిధ పేర్లపై చర్చించారు. కేంద్ర పారిశ్రామిక భద్రత దళం (సీఐఎస్‌ఎఫ్) డైరెక్టర్ జనరల్‌గా ఉన్న 1985 బ్యాచ్ ఐపీఎస్ అధికారి సుబోధ్ కుమార్ జయస్‌వాల్, అదే బ్యాచ్‌కు చెందిన ‘సశస్త్ర సీమా బల్’ డైరెక్టర్ జనరల్ కుమార్ రాజేష్ చంద్ర, కేంద్ర హోం శాఖ అంతర్గత విభాగంలో ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్న కౌముది (1986 బ్యాచ్) పేర్లు ఇందులో ఉన్నట్లు తెలిసింది. 1985 బ్యాచ్‌కు చెందిన ఉత్తర్‌ప్రదేశ్ డీజీపీ హితేష్ సి.అవస్థి పేరు కూడా పరిశీలనలో ఉంది.
సీనియారిటీ, నిబద్ధత, అవినీతి వ్యతిరేక కేసుల దర్యాప్తులో ఉన్న అనుభవం ఆధారంగా డైరెక్టర్‌ను ఎంపిక చేసే అధికారం ప్రధానమంత్రి నేతృత్వంలోని ఎంపిక కమిటీకి ఉంది. డైరెక్టర్‌గా ఉన్న ఆర్‌కే శుక్లా ఈ ఏడాది ఫిబ్రవరిలో పదవీ విరమణ చేశారు. ఆ స్థానంలో సీబీఐ అదనపు డైరెక్టర్ ప్రవీణ్ సిన్హా తాత్కాలికంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.