ఆయుర్వేద మందు వ్యవహారాన్ని ప్రభుత్వానికి, ఆనందయ్యకు మధ్య కొట్లాటగా చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి హైకోర్టు వ్యాఖ్యానించింది. కరోనాతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎంతమంది చనిపోయారో ? ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య చికిత్స తర్వాత ఎంతమంది చనిపోయారో నివేదిక తెప్పించి వాస్తవాలను తెలుద్దామని స్పష్టంచేసింది. అప్పుడు ప్రభుత్వమే ఇరకాటంలో పడుతుందని పేర్కొంది. ఆనందయ్య కంటి చుక్కల మందును తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సుమన్ కోర్టుకు తెలిపారు. పరీక్షల్లో ఆ ఔషదం ఉత్తీర్ణత సాధించలేదన్నారు.
ఆనందయ్య దరఖాస్తును వెంటనే పరిశీలించండి.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
ఆనందయ్య కంటి చుక్కల మందుపై హైకోర్టులో విచారణ జరిగింది. కంటి చుక్కల మందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేసినట్లు హైకోర్టులో ఆనందయ్య రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ దరఖాస్తును వెంటనే పరిశీలించాలని ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది.
సొంత పేషెంట్లకే మందు ఇవ్వాలి తప్ప ఆనందయ్య వద్దకు వచ్చే వేలమందికి అనుమతి ఇచ్చేందుకు చట్ట నిబంధనలను అంగీకరించవన్నారు. ధర్మాసనం స్పందిస్తూ ఆనందయ్య వద్దకు వెళ్లే వారంతా ఆయన పేషెంట్ల కిందకే వస్తారని స్పష్టంచేసింది. కొవిడ్ సమయంలో కష్టాలను ఎదుర్కొంటున్న ప్రజలకు సాయం చేసే ఉద్దేశంతో ముందుకొచ్చే ఆనందయ్య లాంటి వైద్యులను ప్రభుత్వం స్వాగతించాలంది. ఔషధాలపై ఆమోదం పొందే వ్యవహారంపై ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా అథార్టీని ఆశ్రయించడానికి ఆనందయ్యకు అనుమతిచ్చింది . హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంతకుమార్ మిశ్ర , జస్టిస్ ఏవీ శేషసాయితో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది.
ఇదీ చదవండి: TDP LEADERS DELHI TOUR: దిల్లీ చేరుకున్న తెదేపా నేతల బృందం..