కరోనా రోగుల చికిత్స అందించే విషయంలోనే కాకుండా టీకా ఇచ్చే విషయంలోనూ ప్రభుత్వం నుంచి సరైన స్పందనను ఆశిస్తున్నామని హైకోర్టు పేర్కొంది. కరోనా చికిత్స పేరుతో ప్రైవేటు ఆసుపత్రుల అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయంటూ దాఖలైన వ్యాజ్యంలో కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వానికి మరికొంత గడువు ఇస్తూ విచారణను న్యాయస్థానం 4 వారాలకు వాయిదా వేసింది.
కేసు విచారణలో వాదనలు వినిపించిన అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి.. బండిని గుర్రం ఎంత బాగా లాగినా దెబ్బలు తప్పేటట్లు లేవు అన్నట్లు ఉందన్నారు. కరోనా విషయంలో ప్రభుత్వం పలు చర్యలు చేపట్టినా ఆరోపణలు తప్పడం లేదన్నారు. ఈ వాదనపై స్పందించిన ధర్మాసనం.. న్యాయస్థానం దూకుడు లేనప్పుడు కూడా.. మీరెందుకు అగ్రసివ్‌గా ఉన్నారని ఏఏజీని ప్రశ్నించింది. ప్రజల సమస్యల విషయంలో పిటిషర్లు కోర్టులను ఆశ్రయిస్తుంటారని తెలిపింది. ప్రభుత్వం, న్యాయస్థానం, పిటిషనర్లు.. ఇలా ఎవరైనా ప్రజల విస్తృత ప్రజా ప్రయోజనాల కోసమే ఉన్నారన్ని విషయాన్ని గుర్తు చేసింది. అందరు కలిసి సమష్టిగా పనిచేయాలని ధర్మాసనం సూచించింది.