తెలుగు భాష కంటే ఆంగ్లం నేర్చుకోవడం సులభమని ఏపీ ఉన్నత విద్యా పర్యవేక్షణ, నియంత్రణ కమిషన్ చైర్మన్ జస్టిస్ వి.ఈశ్వరయ్య వివరించారు. ఆంగ్లంలో 'A' అక్షరం రాయటం కంటే తెలుగులో 'అ' అనే అక్షరం రాయటం కష్టమన్నారు. వెనుకబడిన తరగతుల వారు ఆంగ్లమాధ్యమంలో విద్య నేర్చుకోకూడదనే ఉద్దేశంతో కొందరు వ్యతిరేకిస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రాథమిక తరగతుల్లో ఆంగ్లమాధ్యమంలో విద్యను అభ్యసిస్తేనే ఉన్నత విద్యలో రాణించటం సులభమవుతుందన్నారు.
తాను వ్యక్తిగతంగా ఈ ఇబ్బందిని ఎదుర్కోన్నానని... అంగ్లంలో అభ్యసించని కారణంగా హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తి కంటే ఉన్నతస్థాయికి వెళ్లలేకపోయానని జస్టిస్ వి.ఈశ్వరయ్య పేర్కొన్నారు. కేవలం మాధ్యమం కారణంగానే సమాజం రెండుగా విడిపోయిందన్నారు. కోర్టుల్లో, పాలనా వ్యవహారాలు ఆంగ్లంలోనే జరుగుతున్నాయని... అలాంటప్పుడు పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమం ఉంటే తప్పేమిటని ప్రశ్నించారు.