పంచాయతీ ఎన్నికల నిర్వహణపై నెలకొన్న ఉత్కంఠకు నేడు తెరపడనుంది. గతేడాది నవంబర్ 17న.. 2021 ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలని.. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రొసీడింగ్స్ జారీ చేసింది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సహకరించని కారణంగా డిసెంబర్ 18న ఎస్‌ఈసీ హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం.. ప్రభుత్వం తరపున ముగ్గురు అధికారులు.. ఎస్ఈసీని సంప్రదించి పరిస్థితులను వివరించాలని.. దానిపై నివేదికను ఇవ్వాలని సూచించింది.
సంప్రదింపుల తర్వాత.. ఎన్నికలపై ఎస్‌ఈసీ నిర్ణయం తీసుకుంటుందని డిసెంబర్ 23న హైకోర్టు తీర్పునిచ్చింది. ఉత్తర్వుల ప్రతులను డిసెంబర్ 29న విడుదల చేసింది. ఉత్తర్వులు అందుకున్న మూడు రోజుల్లోపు ప్రభుత్వం నుంచి ముఖ్య కార్యదర్శి స్థాయి అధికారి ఎస్ఈసీని సంప్రదించాలని సూచించింది. ఉత్తర్వుల ప్రతులను జనవరి 5వ తేదీన ప్రభుత్వం అందుకుంది. జనవరి 8న రాష్ట్ర ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఎస్ఈసీని కలిశారు. రాష్ట్రంలో పరిస్థితులను వివరించారు. సమావేశం తర్వాత జనవరి 8న ఎస్‌ఈసీ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసింది.
ఎస్‌ఈసీ జారీచేసిన నోటిఫికేషన్‌పై జనవరి 9న ప్రభుత్వం హైకోర్ట్‌లో సవాల్ చేసింది. జనవరి 11న విచారణ జరిపిన సింగిల్ జడ్జి ధర్మాసనం... ఎస్‌ఈసీ ఇచ్చిన నోటిఫికేషన్‌పై స్టే విధించింది. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ చేపడుతున్న విషయాన్ని ఎస్‌ఈసీ పరిగణలోకి తీసుకోలేదని కోర్టు అభిప్రాయపడింది. జనవరి 11న సింగిల్ జడ్జి ధర్మాసనం ఇచ్చిన స్టేపై ఎస్‌ఈసీ డివిజన్ బెంచ్ ముందు రిట్ అప్పీల్ దాఖలు చేసింది. అప్పీల్‌పై ఈనెల 18న విచారణ చేపట్టి..19న కూడా విచారణ కొనసాగించింది. 19న ఇరువురి వాదనలు ముగించి.. తీర్పు రిజర్వ్‌లో ఉంచింది. ఇవాళ ఆ అప్పీల్‌పై తీర్పు ఇవ్వనుంది.
ప్రభుత్వం చేపట్టిన వ్యాక్సినేషన్‌కు పంచాయతీ ఎన్నికలు అడ్డురావని ఎస్‌ఈసీ తరపు న్యాయవాది ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయన్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ.. అన్ని రంగాల వారు దినసరి పనులు కొనసాగిస్తున్నారని కోర్టుకు వివరించారు. ఎస్‌ఈసీ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎన్నికలు నిలువరించటం కోర్టు పరిధి కాదని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపడుతున్నామని.. ఉద్యోగులందరూ ఆ పనిలో నిమగ్నమై ఉన్నారని ప్రభుత్వం తరపు ఏజీ వాదనలు వినిపించారు. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు నిర్వహించటం సాధ్యపడదని తెలిపారు. ఇరువురి వాదనలు పరిగణలోకి తీసుకుని ధర్మాసనం ఇవాళ తీర్పు ఇవ్వనుంది.
ఇదీ చదవండీ... అమరావతి సంకల్ప ర్యాలీ... మార్మోగిన ఉద్యమ నినాదం