ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 11, 2021, 4:46 PM IST

Updated : Jan 12, 2021, 9:35 AM IST

ETV Bharat / city

పంచాయతీ ఎన్నికల నిర్వహణపై.. ఎన్నికల సంఘం ఉత్తర్వుల సస్పెన్షన్‌

ap local elections
ఎన్నికల షెడ్యూల్‌ నిలిపివేత

15:03 January 11

పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ నిలిపివేసిన హైకోర్టు

సీనియర్ న్యాయవాది రాజేంద్రప్రసాద్

పంచాయతీ ఎన్నికల నిమిత్తం షెడ్యూల్‌ ప్రకటిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ఈ నెల 8న జారీచేసిన ప్రొసీడింగ్స్‌ను హైకోర్టు నిలిపివేసింది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఎస్‌ఈసీ ఉత్తర్వులను సస్పెండ్‌ చేస్తున్నట్లు పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం నిర్వహించనున్న కరోనా టీకా కార్యక్రమానికి, దాన్ని అమలు చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికలు నిర్వహించాలన్న ఎస్‌ఈసీ నిర్ణయం ప్రతిబంధకంగా మారుతుందని స్పష్టం చేసింది. ఎస్‌ఈసీ నిర్ణయం.. అధికరణ 14, 21లను ఉల్లంఘించేదిగా ఉందని అభిప్రాయపడింది. రాష్ట్ర ప్రభుత్వ వివరాల్ని ఎన్నికల సంఘం పరిగణనలోకి తీసుకోవడంలో విఫలమైందని ఆక్షేపించింది.

సంప్రదింపుల విషయంలో సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా కమిషన్‌ నిర్ణయం తీసుకోలేదని అభిప్రాయపడింది. ఇరువైపుల న్యాయవాదుల వాదనలు విన్న సంక్రాంతి సెలవుల ప్రత్యేక బెంచ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.గంగారావు.. ‘ఎద్దుల పోట్లాటలో లేగదూడ బలికాకూడదని పెద్దలు చెప్పిన మాట గుర్తొస్తోంది. దూడ ప్రాణాన్ని కాపాడాల్సి ఉంది’ అని వ్యాఖ్యానించారు. కౌంటర్‌ వేయాలని ప్రతివాదులకు నోటీసులిస్తూ విచారణను ఫిబ్రవరి 15కి వాయిదా వేశారు.

పంచాయతీ ఎన్నికల కోసం షెడ్యూల్‌ ప్రకటిస్తూ ఈ నెల 8న ఎస్‌ఈసీ జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను నిలిపివేయాలని పంచాయతీరాజ్‌శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీనిపై సంక్రాంతి సెలవుల ప్రత్యేక బెంచ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.గంగారావు సోమవారం విచారణ జరిపి ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఈ మధ్యంతర ఉత్తర్వులను రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ).. ధర్మాసనం ముందు సవాల్‌ చేసింది. అప్పీల్‌పై అత్యవసరంగా విచారణ జరపాలని ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది అభ్యర్థించారు. మంగళవారం (నేడు) ఉదయం 10:30 గంటలకు విచారణ జరుపుతామని కోర్టు తెలిపింది.

ప్రభుత్వ వివరాల్ని పరిగణనలోకి తీసుకోలేదు: ఏజీ

ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ.. ‘కరోనా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన వివరాల్ని ఎస్‌ఈసీ పరిగణనలోకి తీసుకోలేదు. సుప్రీంకోర్టు, హైకోర్టు ఎస్‌ఈసీని ప్రభుత్వంతో సంప్రదించమంటే.. కంటి తుడుపుగా నిర్వహించింది. ముందుగా నిర్ణయించిన ప్రకారమే ఎన్నికల ప్రకటన జారీ చేసింది. 2018 అక్టోబర్‌లో ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు గతేడాది మార్చి 7న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కోసం షెడ్యూల్‌ విడుదలయింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా కరోనా వ్యాప్తి కారణంతో మార్చి 15న ఎస్‌ఈసీ ఎన్నికల్ని నిలిపేసింది. దాన్ని సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఎస్‌ఈసీ నిర్ణయాన్ని సమర్థించిన సుప్రీంకోర్టు.. తదుపరి ప్రక్రియ కొనసాగించాలంటే రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించాలని ఎస్‌ఈసీని ఆదేశించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్‌ఈసీ గత నవంబర్‌ 17న ప్రొసీడింగ్స్‌ ఇచ్చారు. దాన్ని ప్రభుత్వం హైకోర్టులో సవాల్‌ చేసింది. ఇరుపక్షాలు మాట్లాడుకొని ఓ నిర్ణయానికి రావాలని డిసెంబర్‌ 29న కోర్టు ఉత్తర్వులిచ్చింది.  కరోనా సెకండ్‌ వేవ్‌తో ముప్పు ఉందని ఎస్‌ఈసీకి వివరించాం. మొదటి విడతలో రాష్ట్రంలో 1.49 కోట్ల మందికి కరోనా టీకా ఇవ్వాలని, ఈ నెల 16 నుంచి ఆ ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పాం. టీకా ప్రక్రియలో 23 శాఖలతోపాటు అధికార యంత్రాంగమంతా పాల్గొనాలి. ప్రభుత్వ వైఖరిని ఎస్‌ఈసీ..  పేచీకోరు (లిటిగెంట్‌)గా భావిస్తోంది. ఈ నెల 8న ఎస్‌ఈసీ ప్రభుత్వ ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపిన కొన్ని గంటల్లోనే పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల చేసింది. వాస్తవానికి నిలిచిపోయిన ఎన్నికలు జడ్పీటీసీ, ఎంపీటీసీలవి. కానీ ఎస్‌ఈసీ పంచాయతీ ఎన్నికల కోసం షెడ్యూల్‌ ఇచ్చారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. కరోనాపై ముందువరుసలో ఉండి పోరాడుతున్న వారికి ఒకసారి కరోనా టీకా వేస్తే ప్రజల్లో విశ్వాసం కలుగుతుంది. ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం పెరుగుతుంది. తెలంగాణ, కేరళ తదితర రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాక కరోనా కేసుల సంఖ్య పెరిగింది. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని ఎస్‌ఈసీ ఉత్తర్వులను సస్పెండ్‌ చేయండి’ అని కోరారు.

ప్రకటన జారీచేశాక జోక్యం సరికాదు... 

ఎస్‌ఈసీ కార్యదర్శి తరఫు న్యాయవాది అశ్వనీకుమార్‌ వాదనలు వినిపిస్తూ.. ‘ఎన్నికల నిర్వహణ కోసం కమిషన్‌ ఇచ్చిన నోటిఫికేషన్‌ విషయంలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడానికి వీల్లేదని సుప్రీంకోర్టు పలు కేసుల్లో స్పష్టంగా చెప్పింది. కరోనా కారణంగా స్థానిక ఎన్నికల్ని వాయిదా వేయడంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. జోక్యానికి నిరాకరించిన సుప్రీం.. ఎస్‌ఈసీ నిర్ణయాన్ని సమర్థించింది. పంచాయతీ ఎన్నికల కోసం ఈ నెల 8న షెడ్యూల్‌ జారీ చేశాం. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. ఈ దశలో కోర్టుల జోక్యం సరికాదు. ఎన్నికల వాయిదా కోసం కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ప్రభుత్వం ఓ కారణంగా చూపుతోంది. ఇప్పటి వరకు అందుకు విధివిధానాలే లేవు. స్వతంత్ర హోదా కలిగిన ఎస్‌ఈసీ.. స్థానిక ఎన్నికల నిర్వహణ బాధ్యతను ఎందుకు నిర్వర్తించడం లేదని హైకోర్టు గతంలో ప్రశ్నించింది. హైకోర్టు ధర్మాసనం ఆదేశాల నేపథ్యంలో ఎస్‌ఈసీ ఎన్నికల్ని ప్రారంభించింది. ప్రస్తుత వ్యాజ్యాన్ని హైకోర్టు ధర్మాసనం ముందుకు బదిలీ చేయండి. అక్కడున్న ప్రజాప్రయోజన వ్యాజ్యాలతోపాటు దీన్నీ విచారించడం ఉత్తమం. భారీ స్థాయిలో జరగనున్న టీకా ప్రక్రియకు ప్రాధాన్యమివ్వాలని ఏజీ చెప్పడం ఊహాకల్పన. ఎస్‌ఈసీ నిర్వహించిన సమావేశంలో రాజకీయపార్టీలు ఎన్నికల నిర్వహణకు మొగ్గుచూపాయి. మొదటి వరుసలో ఉండి పోరాడేవారికి కేటగిరి 1, 2లో కరోనా టీకా ఇస్తారు. వారు తక్కువ మందే ఉంటారు కాబట్టి టీకా ఇచ్చే కార్యక్రమం ఎన్నికల నిర్వహణకు అవరోధం కాదు. ప్రభుత్వ వ్యాజ్యంపై పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయడానికి సమయమివ్వండి. ప్రస్తుతం మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వకండి’ అని కోరారు.

ఈ నెలలో ఎప్పుడైనా టీకా: ఏఎస్‌జీ

కేంద్ర ఆరోగ్య, హోం శాఖల తరఫున సహాయ సొలిసిటర్‌ జనరల్‌ (ఏఎస్‌జీ) హరినాథ్‌ వాదనలు వినిపిస్తూ.. ‘ప్రజల ప్రాణాలు కాపాడటమే కేంద్ర ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యం. కరోనాపై మొదటి వరుసలో ఉండి పోరాడుతున్న 30 కోట్ల జనాభాకు మొదటి విడతలో టీకా ఇవ్వాలి. దీనిలో ఉద్యోగుల పాత్ర కీలకం. ఈ నెలలో ఎప్పుడైనా టీకా పంపిణీ ఉంటుంది. వ్యాక్సినేషన్‌పై కేంద్ర మార్గదర్శకాలను రాష్ట్రాలు పాటించాల్సిందే. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని తగిన నిర్ణయం తీసుకోండి’ అని కోరారు. మొదటి విడత కరోనా టీకా ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎన్నికల్ని వాయిదా వేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఛైర్మన్‌ కె.వెంకటరామిరెడ్డి, వైఎస్సార్‌ టీచర్ల ఫెడరేషన్‌ వేర్వేరుగా అత్యవసర వ్యాజ్యాలు దాఖలు చేశాయి. ఈ వ్యాజ్యాల్లోనూ పై ఉత్తర్వులే వర్తిస్తాయని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఎస్‌ఈసీ నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలంటూ గరీబ్‌గైడ్‌ స్వచ్ఛంద సంస్థ.. ఇంప్లీడ్‌ పిటిషన్‌ వేసింది. ఆ అనుబంధ పిటిషన్‌ తమ ముందుకు రాలేదని న్యాయమూర్తి తెలిపారు.

ఇదీ చదవండి:

ఎస్​ఈసీ నిర్ణయంపై హైకోర్టుకు ఉద్యోగ సంఘాలు.. ప్రభుత్వం వేసిన పిటిషన్​లో ఇంప్లీడ్

Last Updated : Jan 12, 2021, 9:35 AM IST

ABOUT THE AUTHOR

...view details