ప్రభుత్వ కార్యాలయాలకు రంగుల విషయంలో ప్రభుత్వానికి హైకోర్టు షాకిచ్చింది. పంచాయతీ కార్యాలయాలకు రంగులు వేయటంపై ప్రభుత్వ జీవోను రద్దు చేసింది. ప్రస్తుతం ఉన్న మూడు రంగులకు అదనంగా వేసేది పార్టీ రంగు కాదని...ప్రభుత్వ తరఫు న్యాయవాది హైకోర్టుకు చెప్పారు. సుప్రీంకోర్టు, ఉన్నతన్యాయస్థానం మార్గదర్శకాలను పాటించలేదని న్యాయస్థానం తెలిపింది. ఈ అంశాన్ని కోర్టు ధిక్కారం కింద సుమోటోగా తీసుకుంటామని స్పష్టం చేసింది. కార్యాలయాలకు రంగుల విషయంలో సీఎస్, ఎస్ఈసీ, పంచాయతీరాజ్‌శాఖ కార్యదర్శి నుంచి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం వివరణ కోరింది. ఈనెల 28న సుమోటో కేసు విచారణకు వచ్చే అవకాశముంది.
పంచాయితీ కార్యాలయాలపై వైకాపా రంగులు వేయడంలో హైకోర్టు, సుప్రీంకోర్డు తీర్పునకు విరుద్ధంగా ప్రభుత్వం జీఓ విడుదల చేసిందని న్యాయవాది సోమయాజి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ పిల్‌పై హైకోర్టు నేడు తీర్పునిచ్చింది. పంచాయితీ కార్యాలయాలపై వైకాపా పార్టీ జెండాను పోలీన రంగులను మూడు వారాల్లోగా తొలగించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. రంగులు తొలగించాకే ఎన్నికలు నిర్వహించాలని గతంలోనే స్పష్టం చేసింది. పంచాయితీ కార్యాలయాల రంగుల విషయంలో ప్రభుత్వం 623జీఓను విడుదల చేసింది. ప్రస్తుతం ఉన్న రంగులకు అదనంగా ఓరంగును వేయాలని జీఓలో పేర్కొందని పిటిషినర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. రంగులను తొలగించాలని హైకోర్టు ఆదేశిస్తే... దానికి విరుద్ధంగా మరో రంగును జత చేస్తూ జీఓ జారీ చేయడం తీర్పునకు విరుద్ధమని న్యాయవాది వాదించారు. అదనంగా రంగు వేసినా ప్రస్తుతం ఆ కార్యాలయాలపై ఉన్న రంగులు వైకాపా జెండా రంగులను పోలి ఉన్నాయని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అదనంగా వేస్తున్న రంగు వైకాపా పార్టీకి చెందినది కాదని కోర్టుకు ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. మొత్తం ఉన్నవి ఏడు రంగులేనని.. వాటినే వినియోగిస్తున్నామని గత విచారణలో వాదించారు. ఇరువురి వాదనలు పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది.