పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు విషయంలో ప్రభుత్వం జారీచేసిన గెజిట్ నోటిఫికేషన్లపై హైకోర్టు స్టేటస్ కో విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పిటిషన్లో కౌంటర్లు దాఖలు చేయాలని రాష్ట్ర సీఎస్, సీఆర్డీఏ అధికారులకు స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈనెల 14కు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాకేశ్ కుమార్, జస్టిస్ ఏవీ శేషసాయి, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన త్రిసభ్య ధర్మాసనం మంగళవారం ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది.
రాజధాని తరలింపునకు సంబంధించిన వ్యాజ్యాలను ప్రస్తుత వ్యాజ్యానికి జత చేయాలని న్యాయస్థానం రిజిస్ట్రీని ఆదేశించింది. పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు విషయంలో గెజిట్లను సవాల్ చేస్తూ హైకోర్టులో రాజధాని రైతులు రామారావుతో పాటు మరికొందరు పిటిషన్లు దాఖలు చేశారు. అమరావతి నుంచి రాజధానిని మార్చి.. మూడు రాజధానులు ఏర్పాటుకు చట్టం చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. రాజ్‌భవన్, సీఎం కార్యాలయం, సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలు, పోలీసు శాఖ కార్యాలయాలను అమరావతి నుంచి తరలించకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. నివేదికల ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టకుండా ప్రభుత్వాన్ని నిలువరించాలన్నారు. సీఆర్డీఏ బృహత్తర ప్రణాళికను అమలు చేసేలా ఆదేశించాలని కోరారు.
మరోవైపు సీఆర్డీఏ చట్టం రద్దు, పాలనా వికేంద్రీకరణ చట్టం, రాజధానిపై విశ్రాంత ఐఏఎస్ జీఎన్‌రావు నిపుణుల కమిటీ, బోస్టన్ కమిటీ, ఉన్నత స్థాయి కమిటీ నివేదికలను సవాల్ చేస్తూ టి.శ్రీనివాసరావు, డి.సాంబశివరావు హైకోర్టులో మూడు వ్యాజ్యాలు వేశారు.
భూములు త్యాగం చేశారు..
రాజధాని రైతు పరిరక్షణ సమితి తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది శ్యాం దివాన్ వాదనలు వినిపించారు. రాజధాని నగర నిర్మాణానికి రైతులు వేల ఎకరాల భూములు ఇచ్చారన్నారు. అమరావతి నుంచి రాజధానిని తరలిస్తే వారి జీవనాధారం పోతుందన్నారు. ప్రజల జీవనాధారం లేకుండా చేసే చట్టాలు ఏవైనా చెల్లుబాటు కావంటూ వాటిని రద్దు చేయాలన్నారు. భూములపై మమకారం పక్కన పెట్టి రైతులు రాజధాని కోసం త్యాగం చేశారన్నారు. రాజధాని విషయంలో ఈ ఏడాది జనవరి 20 వరకు రైతుల నుంచి అభ్యంతరాలు స్వీకరించాలని ఉన్నత స్థాయి కమిటీని హైకోర్టు ఆదేశించినా.. జనవరి 17నే ప్రభుత్వానికి నివేదిక సమర్పించిందని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ప్రస్తుతం స్టేటస్ కో ఆదేశాలు ఇవ్వకపోతే పది రోజుల్లో కార్యాలయాలు తరలించేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు.