ఏపీ హైకోర్టులో రాజధాని కేసుల రోజువారీ విచారణ ప్రారంభమైంది. ఉన్నత న్యాయస్థానం సీజే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణను మొదలుపెట్టింది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరుగుతోంది. అయితే.. త్రిసభ్య ధర్మాసనం నుంచి ఇద్దరు జడ్జిలను తప్పించాలని ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు.
కాగా ప్రభుత్వ న్యాయవాది వాదనలను త్రిసభ్య ధర్మాసనం తోసిపుచ్చింది. రాజధాని కేసుల విచారణకు ప్రాముఖ్యం ఉందని ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. రాష్ట్రంలో అభివృద్ధి అంతా నిలిచిపోయినట్లు అనిపిస్తోందని అభిప్రాయం వ్యక్తం చేసింది. కక్షిదారులతోపాటు అందరూ ఇబ్బంది పడుతున్నట్లు అనిపిస్తోందని ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది.
అలా చేయడమంటే ఆత్మను వేరు చేయటమే..
రైతుల తరుపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్ వాదనలు వినిపించారు. రాజధానిపై నిర్ణయం ఒక్కసారే తీసుకుంటారని .. అమరావతి మాస్టర్ ప్లాన్ పరిపూర్ణమైన విధివిధానంతో జరిగిందని వాదించారు. మూడు రాజధానుల ప్రతిపాదన శరీరం నుంచి ఆత్మను వేరు చెయ్యడమే అవుతుందన్నారు. ప్రభుత్వాలు మారినప్పటికీ రాష్ట్రం అలానే ఉంటుంది.. ఇచ్చిన హామీలు నెరవేరబడాలన్నారు. రాష్ట్ర రాజధాని కోసం అమరావతి రైతులు భూములు త్యాగం చేశారన్నారు. రాజధాని భూసమీకరణలో ల్యాండ్ పూలింగ్ స్కీం కోసం ప్రభుత్వ అధికారులే రకరకాల కార్యక్రమాలు చేపట్టారని న్యాయస్థానానికి తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం 5 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించబడిన రాజధానిని వదిలేసిందన్నారు. 41 వేల కోట్ల ప్రాజెక్టులను ప్రభుత్వం నిలుపుదల చేసిందని హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. రాజధాని... గుంటూరు - విజయవాడ మధ్యలో ఉండాలని అత్యధికంగా ప్రజలు అభిప్రాయపడ్డారన్నారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది
ఇదీ చూడండి:KUPPAM ELECTIONS: కుప్పంలో దొంగ ఓటర్లు.. అడ్డుకున్న తెదేపా.. ఉద్రిక్తత