ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్ర ఎన్నికల సంఘం తీరుపై హైకోర్టు ఆగ్రహం

అధికార పార్టీకి చెందిన నేతలు ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నా... చర్యలు ఎందుకు తీసుకోవడం లేదంటూ రాష్ట్ర ఎన్నికల సంఘంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణం చర్యలు తీసుకోకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది. హడావుడిగా స్థానిక ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ ఎస్ఈ​సీని ప్రశ్నించింది.

high court serious
రాష్ట్ర ఎన్నికల సంఘం తీరుపై హైకోర్టు ఆగ్రహం

By

Published : Mar 14, 2020, 6:19 AM IST

రాష్ట్ర ఎన్నికల సంఘం తీరుపై హైకోర్టు ఆగ్రహం

అధికార పార్టీ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిందంటూ వచ్చిన ఫిర్యాదులపై... తక్షణం ఎందుకు స్పందించడం లేదని హైకోర్టు ఈసీని ప్రశ్నించింది. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వస్తే చర్యలు తీసుకునేందుకు తమకు అధికారాలుంటాయని గతంలో కోర్టుకు చెప్పిన ఈసీ... ప్రస్తుతం కోడ్‌ అమల్లో ఉంటే వెంటనే చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ మేరకు తెదేపా నేత కోవెలమూడి రవీంద్ర దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది.

ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదు...

అధికార పార్టీ నేతలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పట్టించుకోవడం లేదన్న పిటిషనర్‌... అనంతపురం జిల్లా తాడిపత్రి వైకాపా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.... మహిళలకు చీరలు, దుస్తులు పంపిణీ చేశారని కోర్టుకు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఆధారాల్ని ఈసీకి అందజేశామని చెప్పారు. కడపలో గ్రామ వాలంటీర్లు, వార్డు కార్యదర్శులతో ఉపముఖ్యమంత్రి అంజాద్‌ బాషా సమావేశం నిర్వహించి వైకాపాకు ప్రచారం చేయాలని కోరారని... ప్రభుత్వ ఉద్యోగుల్ని ఎన్నికల ప్రచారం కోసం వినియోగించుకోవడం తగదని వివరించారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో వైకాపా నేతలు ఇళ్ల స్థలాల పంపిణీ నిమిత్తం కూపన్లు ఇస్తున్నారని... తమకు ఓటేయకపోతే ప్రభుత్వం నుంచి అందాల్సిన వివిధ పథకాల లబ్ధిని ఆపేస్తామని బెదిరిస్తున్నారని న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. ఈ చర్యలన్నీ కోడ్‌ ఉల్లంఘనేనన్న పిటిషనర్‌... ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినా ఈసీ చర్యలు తీసుకోవడం లేదని తెలిపారు.

నివేదిక కోరాం...

పిటిషనర్‌ వాదనలపై స్పందించిన ఈసీ తరపు న్యాయవాది... తాడిపత్రి ఘటనపై తమకు అందిన ఫిర్యాదును అనంతరపురం జిల్లా కలెక్టర్‌కు పంపి నివేదిక కోరామన్నారు. దర్మాసనం స్పందిస్తూ, ఈమెయిల్‌ ద్వారా నివేదిక తెప్పించుకోవచ్చని పేర్కొంది. జిల్లా ఎన్నికల అధికార్లు ప్రస్తుతం మీ నియంత్రణలోనే ఉంటారని గుర్తుచేసింది. కలెక్టర్‌ సరైన నివేదిక ఇవ్వకపోతే ఏమి చేస్తారు..? ప్రభుత్వ నియంత్రణలో ఉన్నవారు ఇచ్చే వివరాలను మీరు విశ్వసిస్తారా..? అని ప్రశ్నించింది. అసలు మీరు జిల్లా కలెక్టరును నివేదిక కోరారా... లేక జిల్లా ఎన్నికల అధికారిని నివేదిక కోరారా అని ప్రశ్నించింది. జిల్లా కలెక్టరును జిల్లా ఎన్నికల అధికారిగా నోటిఫై చేశారా..? లేదా..? అని అడిగింది. ఈసీ తరపు న్యాయవాది బదులిస్తూ తప్పుడు నివేదిక ఇస్తే అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. కోడ్‌ ఉల్లంఘన ఫిర్యాదులపై ఈసీ సకాలంలో స్పందించలేదన్న హైకోర్టు... తమ ఆదేశాల ప్రతిని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపాలని రిజిస్ట్రీని ఆదేశించింది.

హడావుడిగా ఎన్నికల నిర్వహణపై అసహనం

ఎన్నికలు హడావుడిగా నిర్వహించడంపైనా హైకోర్టు అసహనం వ్యక్తంచేసింది. ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేసి ఆ వివరాల్ని తమకు అందించాక... 40-45 రోజుల వ్యవధి కావాల్సి ఉంటుందని చెప్పిన ఈసీ ప్రకటనకు, ఎన్నికల నిర్వహణకు మధ్య తక్కువ సమయాన్ని నిర్ణయించడం ఏంటని ప్రశ్నించింది. ఎన్నికల ప్రకటన జారీచేసే అధికారం మీదా..? ప్రభుత్వానిదా అని నిలదీసింది. ఎన్నికల ప్రకటన తామే జారీచేస్తామని తెలిపిన ఈసీ... పంచాయతీరాజ్‌ చట్టానికి సవరణ చేస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీ చేసిందన్నారు. ఫలితంగా ఎన్నికల ప్రచార తేదీ, నామినేషన్ల దాఖలు, ఉపసంహరణకు సమయం తగ్గిందన్నారు. ఎన్నికల షెడ్యూల్‌, నోటిఫికేషన్‌ జారీ వివరాల్ని కోర్టుకు తెలిపారు. ఆ వివరాల్ని పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం... ఆర్డినెన్స్‌ ప్రతిని తమకు అందజేయాలని పేర్కొంటూ విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

ABOUT THE AUTHOR

...view details