ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో పరిస్థితులు ఏంటో తెలుసు: హైకోర్టు - AP High Cour comments on DPG

రాష్ట్రంలో పరిస్థితులు తమకు తెలుసని.... న్యాయదేవత కళ్లకు గంతలు కట్టి ఉన్నంత మాత్రాన న్యాయమూర్తులకు, న్యాయస్థానాలకు కళ్లు కనబడవని అనుకోవద్దంటూ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల ప్రక్రియలో పాల్గొనడం లేదని సీఎస్ చెప్తుంటే... ఆ పనుల్లో నిమగ్నమవడం వల్ల కోర్టుకు రాలేకపోతున్నానని ఎలా చెప్తారంటూ డీజీపీ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. కోర్టు ధిక్కరణ వ్యాజ్యంపై విచారణ చేపట్టిన ధర్మాసనం.... ఈ నెల 27న డీజీపీ, హోంశాఖ ముఖ్యకార్యదర్శి కోర్టుకు హాజరవాలని స్పష్టం చేసింది.

AP High Court Serious Comments on DGP Sawang
రాష్ట్రంలో పరిస్థితులు తెలుసు: హైకోర్టు

By

Published : Jan 26, 2021, 4:51 AM IST

రాష్ట్రంలో పరిస్థితులు ఏంటో తెలుసు: హైకోర్టు

తాము ఆదేశించినప్పటికీ విచారణకు గైర్హాజరనందుకు రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్‌పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల పనులంటూ అఫిడవిట్‌లో ఆయన పేర్కొన్న కారణం సహేతుకంగా లేదని పేర్కొంది. హాజరు మినహాయింపు అభ్యర్థనను తోసిపుచ్చుతూ డీజీపీతో పాటు, ఐజీ మహేష్‌చంద్ర లడ్డాకు నాన్‌ బెయిలబుల్ వారంట్‌ జారీ చేసి విచారణను వాయిదా వేయబోయింది.

ఈ సమయంలో స్పందించిన సీనియర్ న్యాయవాది ఎస్​ఎస్ ప్రసాద్.. డీజీపీ హాజరయ్యేందుకు మరో అవకాశమివ్వాలని, మెరుగైన అఫిడవిట్ దాఖలుకు తావివ్వాలని కోరారు. ఈ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి డీజీపీ, ఐజీ పేర్కొన్న కారణాలు సంతృప్తికరంగా లేకున్నా... వారి పదవులను పరిగణనలోకి తీసుకుని సోమవారం నాటి విచారణకు హాజరు మినహాయింపు ఇస్తున్నట్టు పేర్కొన్నారు. తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేస్తూ... ఆ రోజు హోంశాఖ ముఖ్యకార్యదర్శి కుమార్ విశ్వజిత్, డీజీపీ, ఐజీ వ్యక్తిగతంగా హాజరై కోర్టుకు వివరణ ఇవ్వాల్సిందేనని తేల్చిచెప్పారు.

ఎస్సై యూ.రామారావుకు సీఐగా పదోన్నతి కల్పించే ప్యానల్లో స్థానమిచ్చే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని హైకోర్టు గతంలో ఉత్తర్వులిచ్చింది. వాటిని అమలు చేయకపోవడంతో రామారావు కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు... ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. వాటిని అందుకున్నా డిసెంబర్ 29న హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, ఐజీ న్యాయవాదులను నియమించుకోలేదు. స్వయంగానూ హాజరవలేదు.

దీంతో ఆగ్రహించిన న్యాయమూర్తి వారి వ్యక్తిగత హాజరు నిమిత్తం ఫామ్-1 నోటీసు జారీచేశారు. విచారణను నిన్నటికి వాయిదా వేయగా... అనారోగ్యం వల్ల హాజరవలేకపోతున్నానన్న హోంశాఖ ముఖ్యకార్యదర్శి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్నారు. పంచాయతీ ఎన్నికల వల్ల ఫిబ్రవరి 27 వరకూ డీజీపీ కోర్టుకు హాజరు కాలేరంటూ ఆయన తరఫు న్యాయవాది ఎస్​ఎస్ ప్రసాద్ వాదించారు. అఫిడవిట్‌లోని వివరాలు పరిశీలించాక న్యాయమూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. కోర్టు బయట జరిగేవి తమకు తెలియదనుకుంటున్నారా..? ఎన్నికలు నిర్వహించే స్థితిలో లేమని సీఎస్ అంటే... దానికి విరుద్ధంగా ఎన్నికల విధుల్లో ఉన్నానని డీజీపీ ఎలా చెప్తారని ప్రశ్నించారు. ఎన్నికల విషయంలో కోర్టు ఆదేశాలు అమల్లో ఉన్నంతవరకూ సీఎస్, డీజీపీ మరెవరైనా సరే..... రాజ్యాంగం ప్రకారం ఎన్నికల కమిషన్ పరిధిలో పనిచేయాల్సిందేనని న్యాయమూర్తి అన్నారు.

ప్రస్తుత పిటిషనర్ రామారావు పదోన్నతి విషయంలో తాము ఆదేశాలిచ్చి చాలా రోజులవుతున్నా... ఇప్పటికీ అమలు చేయలేదని న్యాయమూర్తి ఆగ్రహించారు. కోర్టు ఉత్తర్వులను గౌరవిస్తూ నిజమైన స్ఫూర్తితో అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. పిటిషనర్ పదోన్నతి వ్యవహారాన్ని చూడాల్సింది డీఐజీ అంటూ.... డీజీపీ తరఫు న్యాయవాది వాదించగా.... పోలీసు శాఖాధిపతిగా కోర్టు ఉత్తర్వులు అమలు చేయించాల్సిన బాధ్యత డీజీపీకి లేదా అని న్యాయమూర్తి ప్రశ్నించారు. లీగల్ అడ్వైజర్లు, ప్రభుత్వ న్యాయవాదులు అధికారులకు సక్రమంగా సలహాలు ఇవ్వడం లేదన్నారు. నోటీసులు అందలేదని డీజీపీ తరఫు న్యాయవాది అనటంతో... రిజిస్ట్రీ సిబ్బందిని పిలిపించి రికార్డులు పరిశీలించారు. కోర్టు పంపిన నోటీసును డీజీపీ కార్యాలయం అందుకుందని స్పష్టం చేశారు.

ఇదీ చదవండీ... కన్నకూతుర్లనే కడతేర్చిన కేసులో ముమ్మర దర్యాప్తు

ABOUT THE AUTHOR

...view details