ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మాజీ మంత్రి నారాయణకు సీఐడీ కేసులో ముందస్తు బెయిల్ - Anticipatory bail to Narayana

రాజధాని బృహత్ ప్రణాళిక, ఇన్నర్​ రింగ్​రోడ్డు అలైన్​మెంట్​లో ఆరోపణలపై సీఐడీ నమోదు చేసిన కేసులో మాజీ మంత్రి నారాయణకు ముందస్తు బెయిల్ మంజూరైంది.

మాజీ మంత్రి నారాయణ
మాజీ మంత్రి నారాయణ

By

Published : Sep 6, 2022, 7:16 PM IST

Updated : Sep 7, 2022, 6:38 AM IST

రాజధాని అమరావతి మాస్టర్‌ ప్లాన్‌, ఇన్నర్‌ రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్‌ విషయంలో అక్రమాలు జరిగాయంటూ సీఐడీ నమోదు చేసిన కేసులో మాజీ మంత్రి నారాయణ తదితరులకు హైకోర్టులో ముందస్తు బెయిల్‌ మంజూరైంది. అభియోగ పత్రం దాఖలు చేసే వరకు దేశం విడిచి వెళ్లాలంటే కోర్టు అనుమతి తీసుకోవాలని షరతు విధించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు మంగళవారం ఈ మేరకు తీర్పు ఇచ్చారు.

అమరావతి బృహత్‌ ప్రణాళిక డిజైనింగ్‌, ఇన్నర్‌ రింగ్‌రోడ్డు, దానిని అనుసంధానించే రహదారుల అలైన్‌మెంట్‌ విషయమై అక్రమాలు చోటుచేసుకున్నాయని మంగళగిరి వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏప్రిల్‌ 27న ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మే 9న తెదేపా అధినేత, నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారాయణ సహా వ్యాపారవేత్త లింగమనేని రమేశ్‌, ఆయన సోదరుడు లింగమనేని వెంకట సూర్య రాజశేఖర్‌, రామకృష్ణ హౌజింగ్‌ సంస్థ డైరెక్టర్‌ కె.పి.వి.అంజనీ కుమార్‌లపై సీఐడీ కేసు నమోదు చేసింది. దీంతో ముందస్తు బెయిల్‌ కోరుతూ నారాయణ తదితరులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన కోర్టు.. పిటిషనర్ల విషయంలో తొందరపాటు చర్యలొద్దని మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.

రాజకీయ కక్షతో కేసు..
పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ... మంత్రి హోదాలో నారాయణ సమీక్షల్లో పాల్గొని తన ఆలోచనలను పంచుకున్నారు తప్ప.. అలైన్‌మెంట్‌ మార్పు విషయంలో ఎవరినీ ఒత్తిడి చేయలేదన్నారు. రాజకీయ కక్షతో కేసు పెట్టారని చెప్పారు. ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కాగితాలకే పరిమితమైందని.. ఏర్పాటేకాని రహదారితో అనుచిత లబ్ధి ఎలా సాధ్యమని ప్రశ్నించారు. మాస్టర్‌ ప్లాన్‌పై ఆరేళ్ల తర్వాత ఇప్పుడు ఫిర్యాదు చేయడమేంటని ప్రశ్నించారు. సీఆర్‌డీఏ చట్టం సెక్షన్‌ 146 ప్రకారం.. సమష్టిగా తీసుకున్న నిర్ణయాల విషయంలో ప్రభుత్వానికి, అధికారులకు ప్రాసిక్యూషన్‌ నుంచి రక్షణ ఉందని తెలిపారు. వారిని విచారించడానికి వీల్లేకుండా నిషేధం ఉందన్నారు.

అక్కడ భూములు ఉండడమే పాపమైంది!
లింగమనేని సోదరులు, రామకృష్ణ హౌసింగ్‌ తరఫున సీనియర్‌ న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ... తమ పిటిషనర్లకు చెందిన భూములు ప్రతిపాదిత రింగ్‌రోడ్డుకు 5 నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయని.. అనుచిత లబ్ధి పొందారనడంలో వాస్తవం లేదని వెల్లడించారు. ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరారు. సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. వాదనలు ముగియడంతో న్యాయమూర్తి తీర్పును రిజర్వు చేశారు. ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తూ తాజాగా ఉత్తర్వులిచ్చారు.

ఇవీ చదవండి:

Last Updated : Sep 7, 2022, 6:38 AM IST

ABOUT THE AUTHOR

...view details