కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆగస్టు 3 వరకూ హైకోర్టులో కేసుల విచారణలన్నీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే జరుగుతాయని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ భానుమతి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. హైకోర్టు నియంత్రణలో పనిచేసే ఏపీ న్యాయ సేవాధికార సంస్థ, హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ , మధ్యవర్తిత్వ కేంద్రాల్లో విచారణలకు ఈ ఆదేశాలు వర్తిస్తాయన్నారు. అన్ని తరహా వ్యాజ్యాలను... ఈ - ఫైలింగ్ విధానంలోనే దాఖలు చేయాలన్నారు.
బ్లూ జీన్స్ వీడియో కాన్ఫరెన్సింగ్ అప్లికేషన్ , హైకోర్టు ధ్రువీకరించిన మరే ఇతర అప్లికేషన్ ద్వారా అన్ని తరహా కేసుల్లో విచారణలు జరుగుతాయన్నారు. ఇంటివద్ద నుంచే విచారణలు కొనసాగించాలని హైకోర్టు న్యాయమూర్తులు భావిస్తే.... ఆ విధానాన్నే అనుసరించొచ్చన్నారు. జూన్ 24 నుంచి దాఖలైన వ్యాజ్యాలను వరుస క్రమంలో విచారణకు తీసుకుంటారని వెల్లడించారు. అత్యవసర కేసుల్లో దరఖాస్తు చేసుకుంటే హైకోర్టు సీజే నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.
దిగువ న్యాయస్థానాల్లోనూ
- దిగువ కోర్టుల్లోనూ అన్ని తరహా కేసుల్ని ఈ - ఫైలింగ్ విధానంలోనే దాఖలు చేయాలి.
- న్యాయాధికారి తన అధికారిక నివాసం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరుపుతారు.
- ఆగస్టు 3 వరకు రోజూవారీ కేసుల జాబితాలో ఉన్న వ్యాజ్యాలన్నింటినీ నెల రోజులు వాయిదా వేయాలి. విచారణ ఖైదీల కేసుల విషయంలో ఈ నిబంధన వర్తించదు.