ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సంగం డెయిరీ కేసు: ఐదు గంటల పాటు వాదనలు.. తీర్పు రిజర్వు - acb raids on sangam dairy

సంగం డెయిరీని స్వాధీనం చేసుకుంటూ ఇచ్చిన జీవోపై హైకోర్టులో విచారణ జరిగింది. డెయిరీ తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ఆదినారాయణ వాదనలు వినిపించగా.. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ వాదించారు. సుమారు ఐదు గంటల పాటు వాదనలు కొనసాగాయి. న్యాయస్థానం తీర్పును రిజర్వు చేసింది.

sangam dairy
ap high court sangam dairy

By

Published : May 3, 2021, 5:37 PM IST

Updated : May 3, 2021, 7:33 PM IST

సంగం డెయిరీ ఆస్తులను స్వాధీనం చేసుకునే అధికారం ప్రభుత్వానికి లేదంటూ హైకోర్టులో దాఖలైన వాజ్యంపై తీర్పును న్యాయస్థానం రిజర్వు చేసింది. సుమారు 5 గంటలపాటు న్యాయస్థానం ముందు ఇరువర్గాలు తమ వాదనలు వినిపించాయి. డెయిరీ తరఫున సీనియర్‌ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. ప్రభుత్వం దురుద్దేశంతోనే సంగం డెయిరీ విషయంలో జోక్యం చేసుకుంటోందన్నారు. జీవో అమలును నిలుపుదల చేయాలని అభ్యర్థించారు. గురువారం పిటిషనర్‌ వాదనలు వినిపించగా.. అడ్వొకేట్‌ జనరల్‌ ఈరోజు ప్రభుత్వం తరఫున వాదించారు.

డెయిరీని ఆంధ్రప్రదేశ్‌ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ పరిధిలోకి తీసుకుంటూ ఈ నెల 27న జారీ అయిన జీవో 19ను సవాల్ చేస్తూ.. సంగం మిల్క్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ లిమిటెడ్‌ డైరెక్టర్‌ వి.ధర్మారావు హైకోర్టులో వ్యాజ్యం వేశారు. "డెయిరీ భూములను పాల ఉత్పత్తిదారుల భాగస్వామ్యంతో కొన్నారు. డెయిరీని సహకార సంఘంగా మారుస్తూ 43 ఏళ్ల కిందట ఇచ్చిన జీవోను ప్రభుత్వం ఇప్పుడు ఉపసంహరించింది. గుంటూరు జిల్లా మిల్క్‌ ప్రొడ్యూసర్స్‌ కో-ఆపరేటివ్‌ యూనియన్‌ లిమిటెడ్‌ (జీడీఎంపీసీయూఎల్‌)ను.. గుంటూరు జిల్లా పాల ఉత్పత్తిదారుల మ్యూచువల్లీ ఎయిడెడ్‌ కో-ఆపరేటివ్‌ యూనియన్‌ లిమిటెడ్‌ (జీడీఎంపీఎంఏసీయూఎల్‌)గా మార్చే క్రమంలో ప్రభుత్వానికి ఉన్న బకాయిలు, మూలధనం వాటాను తిరిగి చెల్లించారు. డెయిరీలో ప్రభుత్వ ఆస్తులు ఏమీ లేవు. జీడీఎంపీఎంఏసీయూఎల్‌గా మార్చడంపై అభ్యంతరం ఉంటే ఏపీడీడీసీ అప్పట్లోనే కో-ఆపరేటివ్‌ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించాల్సింది. తర్వాత కంపెనీ చట్టం కింద ఎస్‌ఎంపీసీఎల్‌గా రిజిస్ట్రేషన్‌ చేశాం. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారాక డెయిరీ విషయంలో జోక్యం ఎక్కువైంది. డెయిరీలో ప్రభుత్వ ఆస్తులు ఉన్నాయని భావిస్తే సంబంధిత అథారిటీ వద్దకు వెళ్లి పోరాడాలి. అంతే తప్ప.. ఆస్తులు, యాజమాన్యాన్ని స్వాధీనం చేసుకోవడం వాటాదారుల హక్కులను హరించడమే. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని జీవో అమలును నిలుపుదల చేయండి’' అని పిటిషనర్‌ తరఫున న్యాయవాది ఆదినారాయణరావు మరోసారి తన వాదన వినిపించారు. అడ్వొకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరామ్‌ ప్రభుత్వ వాదనలు వినిపించగా.. న్యాయస్థానం తీర్పును రిజర్వు చేసింది.

Last Updated : May 3, 2021, 7:33 PM IST

ABOUT THE AUTHOR

...view details