ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అంబటి రాంబాబు కేసులో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు - ఏపీ హైకోర్టు వార్తలు

సత్తెనపల్లి వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు కేసులో ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. అక్రమ తవ్వకం జరిగిందని, ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌జీపీ కాసా జగన్‌మోహన్‌రెడ్డి కోర్టుకు తెలిపారు. ధర్మాసనం విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

ap High Court on ambati
ap High Court on ambati

By

Published : Mar 31, 2021, 8:22 AM IST

సత్తెనపల్లి వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు, మరో ఎనిమిది మంది.. గనుల అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై మంగళవారం హైకోర్టు విచారణ చేపట్టింది. అక్రమ తవ్వకం జరిగిందని, ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసినట్లు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎస్‌జీపీ) కాసా జగన్‌మోహన్‌రెడ్డి కోర్టుకు తెలిపారు. గనుల అక్రమ తవ్వకాలు జరిగాయని, కేసు నమోదు చేశామని మీరే చెబుతున్నప్పుడు బాధ్యుల నుంచి సొమ్ము తిరిగి రాబట్టేందుకు ఎందుకు చర్యలు తీసుకోలేదని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే గోస్వామి, జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. లీజు హోల్డర్‌ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు కమిటీ నివేదిక ఇచ్చిందని ఎస్‌జీపీ చెప్పారు. పిటిషనర్లకూ గనుల తవ్వకాల్లో పాత్ర ఉందన్నారు. తాజా వివరాలతో అదనపు అఫిడవిట్‌ వేసేందుకు సమయం కావాలన్నారు. అందుకు అంగీకరించిన ధర్మాసనం విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

అంబటి పాత్ర ఉండటం వల్లే చర్యల్లేవు

గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం కోటనెమలిపురి, కుబాదుపురం రెవెన్యూ గ్రామాల పరిధిలోని ప్రభుత్వ భూముల్లో ఎమ్మెల్యే అంబటి రాంబాబు, ఆయన మనుషులు అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారని పేర్కొంటూ వైకాపా కార్యకర్తలు పప్పుల శ్రీనివాసరెడ్డి, నల్లగొర్ల రామయ్య గతేడాది హైకోర్టులో పిల్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యం మంగళవారం హైకోర్టులో మరోసారి విచారణకు వచ్చింది.

పిటిషనర్ల తరఫు న్యాయవాది నాగరఘు వాదనలు వినిపిస్తూ.. ‘గనుల అక్రమ తవ్వకాలపై పోరాడుతున్న పిటిషనర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. గనుల తవ్వకాలను అధికారులు, మంత్రులు, ముఖ్యమంత్రి దృష్టికి పిటిషనర్లు తీసుకెళ్లారు. గత ప్రభుత్వ హయాంలో అక్రమ మైనింగ్‌ను ప్రశ్నించిన ప్రస్తుత ఎమ్మెల్యే అంబటి రాంబాబు.. ఇప్పుడు అక్రమ తవ్వకాలతో ప్రజా ఖజానాకు నష్టం తెస్తున్నారు. ఖనిజాన్ని తరలిస్తున్న వాహనాల నంబర్లు సహా ఫిర్యాదు చేసినా అధికారులు చర్యలు తీసుకోలేదు. అంబటి రాంబాబుకు ఈ వ్యవహారంలో పాత్ర ఉండటం వల్లే చర్యల్లేవు’ అని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

ఇదీ చదవండి:కొవిడ్​ను తరిమికొట్టాలంటే.. వ్యాక్సినేషన్ తప్ప మరోమార్గం లేదు: సీఎం

ABOUT THE AUTHOR

...view details