రాష్ట్రంలోని ప్రభుత్వ, స్థానికసంస్థల పాఠశాల ప్రాంగణాల్లో ఇతర నిర్మాణాలకు తావివ్వొద్దంటూ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. బడి ప్రాంగణంలో గ్రామ సచివాలయ భవన నిర్మాణ యత్నం... రాష్ట్ర విద్యాచట్టం, జాతీయ విద్యావిధానం, అధికరణ 21, 21Aకి విరుద్ధమని తేల్చి చెప్పింది. విద్యాహక్కులోనే పారిశుద్ధ్యం, ఆటస్థలం, ఆరోగ్యకర వాతావరణం, సౌకర్యాలతో కూడిన నాణ్యమైన విద్య పొందే హక్కు ఇమిడి ఉందని పేర్కొంది. పాఠశాలలతో సంబంధం లేని నిర్మాణాలు... ఆ ప్రాంగణాల్లో జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించింది.
పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి, పాఠశాల విద్యాకమిషనర్ తదితరులను ప్రతివాదులుగా చేర్చింది. కౌంటర్ దాఖలు చేయాలని పేర్కొన్న న్యాయస్థానం... మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. విశాఖ జిల్లా తిరువోలు మండలం ప్రాథమిక పాఠశాలలోని ఆటస్థలంలో గ్రామసచివాలయ భవన నిర్మాణానికి చెట్లను కొట్టేస్తున్నారని... పూర్వ విద్యార్థి కోటేశ్వరరావు సహా మరికొంతమంది హైకోర్టును ఆశ్రయించారు. ఇరువైపుల వాదనలను విన్న న్యాయమూర్తి.... రాష్ట్ర ప్రభుత్వం చట్ట నిబంధనలకు లోబడే ఉండాలన్నారు.