కరోనా వ్యాప్తితో ఇబ్బందులు పడుతున్న పాత్రికేయులకు ఆర్థికసాయం చేయాలని కోరుతూ దాఖలపై పిటిషన్ రెండు వారాల్లో తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ లో గుర్తింపు పొందిన (అక్రిడేటెడ్ ) పాత్రికేయులకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలని కోరుతూ కృష్ణా జిల్లాకు చెందిన వై.సూర్య రాజేశ్వరరావు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. పిటిషనర్ వాదనలు విన్న జస్టిస్ ఎం. సత్యనారాయణమూర్తి, జస్టిస్ కె. లలిత ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. పిటిషనర్ కు చెందిన సమాఖ్య ఇచ్చిన వినతి పై రెండు వారాల్లో తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
పిటిషనర్ తరపు న్యాయవాది ఎస్. ప్రణతి వాదనలు వినిపిస్తూ .. కరోనా వల్ల పాత్రికేయులు తీవ్రఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కొందరు జర్నలిస్టులు ఉద్యోగాలు కోల్పోయి జీవనాధారం కష్టమైందన్నారు. ఈ నేపథ్యంలో రూ.25 వేలు ఆర్థిక సాయం చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి పిటిషనర్ సమాఖ్య జూన్ 20 న వినతి సమర్పించిందన్నారు. ఆర్థిక సాయం చేసేలా, ఆ వినతిపై నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలని పిటిషనర్ కోర్టును కోరారు. సాయం చేయాలని ప్రభుత్వాన్ని బలవంత చేయలేమని పేర్కొన్న ధర్మాసనం.. పిటిషనర్ సమర్పించిన వినతిపై 2 వారాల్లో చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించింది.