YS Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో బైయిల్ కోరుతూ నిందితులు సునీల్ యాదవ్, ఉమాశంకర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది. న్యాయవాది గూడపాటి వెంకటేశ్వరరావు.. వివేకా కుమార్తె సునీత తరఫున వాదనలు వినిపించారు. బెదిరింపులకు పాల్పడేవారు.. బెయిల్ పొందడానికి అనర్హులని అన్నారు. జైల్లో ఉంటూనే నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి.. సాక్షులను బెదిరించడంతోపాటు దర్యాప్తును ప్రభావితం చేస్తున్నారని చెప్పారు. అప్రూవర్‌గా మారిన దస్తగిరి.. ఇతర నిందితుల నుంచి ప్రాణహాని ఉందని చెబుతున్న విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. గతంలో నిందితులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై హైకోర్టు సింగిల్ జడ్జి విచారణ జరిపి వాటిని కొట్టేశారని గుర్తుచేశారు.
ప్రస్తుత వ్యాజ్యాలు అక్కడికే విచారణకు వెళ్లాలన్నారు. సుప్రీంకోర్టు తాజాగా ఈ వ్యవహారమై ఓ తీర్పు ఇచ్చిందని చెప్పారు. సుప్రీంకోర్టు, ఇతర హైకోర్టులు ఇచ్చిన తీర్పు ప్రతులను విచారణకు స్వీకరించాలని కోరారు. ప్రస్తుత పిటిషన్‌లో ప్రతివాదిగా చేరి.. వాదనలు వినిపించేందుకు మృతుడి కుమార్తె సునీతకు అర్హత ఉందన్నారు. ఇంప్లీడ్ పిటిషన్‌ను అనుమతించాలని కోరారు. అందుకు అంగీకరించిన న్యాయమూర్తి ఇంప్లీడ్ పిటిషన్‌ను అనుమతించారు. ప్రధాన బెయిల్ పిటిషన్లలో కౌంటర్ వేసేందుకు.. సునీతకు వెసులుబాటు ఇచ్చారు. సీబీఐతోపాటు సునీత తరఫు న్యాయవాది వాదనల కొనసాగింపునకు విచారణను ఈ నెల 6కి వాయిదా వేశారు.
నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిపై మొత్తం 31 కేసులు ఉన్నాయని సీబీఐ తరఫు న్యాయవాది చెన్నకేశవులు వాదనలు వినిపించారు. ఆయన అమాయకుడు కాదని నేరచరిత్ర ఉందన్నారు. అరెస్టయిన దగ్గర్నుంచీ.. దర్యాప్తును ప్రభావితం చేస్తున్నారని కోర్టుకు తెలిపారు. సాక్షుల్ని బెదిరిస్తున్నారన్నారు. కడప కేంద్ర కారాగారం సూపరింటెండెంట్.. మెజిస్ట్రేట్ అనుమతి తీసుకోకుండా శివశంకర్‌రెడ్డిని ఆసుపత్రికి తరలించారని పేర్కొన్నారు. ఈ వ్యవహారమై సూపరింటెండెంట్‌కు షోకాజ్ నోటీసు జారీ అయ్యిందని తెలిపారు. వివేకా హత్య కుట్రలో ఇతర నిందితులతో పాటు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి పాత్ర ఉందన్నారు. దర్యాప్తు కొనసాగుతోందని.. ఇలాంటి సమయంలో నిందితులకు బెయిల్ ఇస్తే సాక్షుల్ని ప్రభావితం చేస్తారన్నారు. గతంలో నిందితులకు బెయిల్ తిరస్కరించిన హైకోర్టు జడ్జి వద్దకే.. ప్రస్తుత బెయిల్ పిటిషన్లూ విచారణకు వెళ్లాల్సి ఉందన్నారు. మృతుడి కుమార్తెగా సునీత.. ఈ వ్యవహారంపై లేవనెత్తిన అభ్యంతరాన్ని పరిష్కరించాక విచారణలోకి వెళ్లాలన్నారు.