తిరుమలలో 10 రోజుల వైకుంఠ ద్వారా దర్శనంపై దాఖలైన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టివేసింది. మత విశ్వాసానికి సంబంధించిన విషయాల్లో సహజంగా న్యాయస్థానాలు జోక్యం చేసుకోవని స్పష్టం చేసింది. పిటిషనర్ దాఖలు చేసిన వ్యాజ్యానికి విచారణార్హత లేదన్న తితిదే తరఫు న్యాయవాది వాదనలను పరిగణనలోకి తీసుకొన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యు.దుర్గాప్రసాదరావు ఈ వ్యాజ్యాన్ని కొట్టేస్తూ ఉత్తర్వులిచ్చారు.
స్వతంత్రంగా నిర్ణయం తీసుకుంది
వైకుంఠ ఏకాదశి రోజు (2020 డిసెంబర్ 25) నుంచి భక్తులకు పది రోజులపాటు ఉత్తరద్వారం దర్శనం కల్పించేందుకు తితిదే బోర్డు చేసిన తీర్మానాన్ని సవాలు చేస్తూ కేఎస్ సాయినాథ్‌శర్మ హైకోర్టులో వ్యాజ్యం వేశారు. పది రోజులు వైకుంఠ ద్వారం తెరిచి ఉంచడం గత సంప్రదాయాలకు, ఆగమశాస్త్రానికి విరుద్ధమన్నారు. మఠాధిపతులు, పీఠాధిపతుల అభిప్రాయాల్ని స్వీకరించకుండా తితిదే స్వతంత్రంగా నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. ఆర్థిక ప్రయోజనం పొందడం కోసం భక్తుల మనోభావాల్ని దెబ్బతీసేలా ఏకపక్ష నిర్ణయం తీసుకుందన్నారు.